వాషింగ్టన్, అక్టోబర్ 29 : అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. రెండు రోజుల ద్రవ్యసమీక్ష బుధవారంతో ముగియగా.. స్వల్పకాలిక వడ్డీరేటును 3.75-4 శాతం శ్రేణికి దించింది. మునుపు ఇది 4-4.25 శాతంగా ఉన్నది. నిజానికి వడ్డీరేట్ల కోతకు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అస్సలు సుముఖంగా లేకుండగా.. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌తో మరో మార్గం లేకుండాపోయింది. ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణం వివరాలు అధికారికంగా వెల్లడికాని పరిస్థితి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి ఫెడ్కున్న ఆధారాలు కాస్తా మూసుకుపోయినైట్టెంది. ప్రతిసారీ ద్రవ్యసమీక్షను ఈ గణాంకాల ఆధారంగానే ఫెడ్ చేస్తుంది మరి.
ఈ క్రమంలోనే ట్రంప్ సర్కారు వడ్డీరేట్ల తగ్గింపు ఒత్తిళ్లకు ఫెడ్ తప్పక తలొగ్గాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక చివరిసారిగా గత నెల సెప్టెంబర్ 17న వడ్డీరేట్లను ఫెడ్ రిజర్వ్ తగ్గించింది. ఈ ఏడాది అదే తొలిసారి. ఇప్పుడు తాజాగా రెండోసారి వడ్డీరేట్లకు కోత పెట్టింది. ఇదిలావుంటే బంగారం ధరలు మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయి. వడ్డీరేట్లు తగ్గడంతో బాండ్ మార్కెట్లోని పెట్టుబడులు.. గోల్డ్ మార్కెట్‌కు క్యూ కట్టే వీలున్నది.