IT Companies | న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ ఐటీ సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ దేశాలపై ఆర్థిక మాంద్యం పిడుగుపడటంతో ఐటీ సంస్థలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగులను తొలగించిన సంస్థలు..తాజాగా క్యాంపస్‌ల నుంచి రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకు నియామకాలను నిలిపివేశాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జెన్సర్లు ఏకంగా 10 వేల మంది ఫ్రెషర్లకు మొండిచెయ్యి చూపించాయి సంస్థలు. ఆన్ బోర్డింగ్లోవున్న ఉద్యోగులకు నిరాశతప్పటం లేదని నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్(ఎన్ఐటీఈఎస్) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
దేశీయ టాప్ ఐటీ సంస్థల్లో ఉద్యోగం వచ్చిందని సంబరపడుతున్న ఫ్రెషర్ల ఆశలు గండికొడుతున్నాయని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్పీత్ సింగ్ సాలుజా తెలిపారు. ముఖ్యంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలో ఉద్యోగుల సంఖ్య సంయుక్తంగా 64 వేల వరకు తగ్గాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 50 వేల మంది ఫ్రెచర్లను నియమించుకున్న ఇన్ఫోసిస్..ఈసారి 11,900 మందిని మాత్ర మే రిక్రూట్ చేసుకున్నది. రెండేండ్ల క్రితం భారీ స్థాయిలో సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించిన సంస్థలు ప్రస్తుతానికి వెనుకుంజవేస్తున్నాయి. అంతర్జాతీయ క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనివ్వడం కూడా రిక్రూట్మెంట్లకు బ్రేక్‌పడినట్లు అయింది.
అంతర్జాతీయ ఆర్థిక రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ సారి ఎంత మందిని ఫ్రెషర్లను తీసుకునేదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఐటీ ప్రతినిధి ఒకరు చెప్పారు. 2022లో మొత్తం రిక్రూట్మెంట్లలో 3-5 శాతం వరకు ఫ్రెషర్లను నియమించుకున్న టాప్ ఐటీ సంస్థలు.. ఇప్పటి వరకు వారికి ఎలాంటి రోల్‌ను అప్పగించలేదని టీమ్‌లీజ్ వెల్లడించింది. ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టడం, ఫ్రెషర్లలో ప్రతిభ లేకపోవడం కూడా ప్రధాన కారణాలని పేర్కొంది. టీసీఎస్‌లో 2021-22లో 59 శాతంగా ఉన్న యువ ఉద్యోగుల వాటా గత ఏడాది 50.3 శాతానికి తగ్గింది.