Record GST Collection | ఏప్రిల్‌లో దేశ స్థూల జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 12.4 శాతం పెరగడం విశేషం. దేశీయ లావాదేవీలు, దిగుమతుల్లో బలమైన వృద్ధి జీఎస్టీ వసూళ్లు పెరగడానికి కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2017 జూలైలో జీఎస్టీ అమలులోకి వచ్చాక నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం.
గతేడాది ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లే.. ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే. 2024 ఏప్రిల్‌లో స్థూల వస్తుసేవల పన్ను (GST) వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. రీఫండ్ల తర్వాత ఏప్రిల్ 2024లో నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.92 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.1 శాతం వృద్ధి నమోదైంది.
ఏప్రిల్‌లో సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.43,846 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.53,538 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,623 కోట్లు, ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై రూ.37,826 కోట్లు ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ.1,008 కోట్లతో కలిపి రూ.13,260 కోట్లు సెస్ వసూలైంది. మార్చి 2024లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.78 లక్షల కోట్లు. మార్చి జీఎస్టీ వసూళ్లలో రీఫండ్ తర్వాత నికర జీఎస్టీ ఆదాయం రూ. 1.65 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది మార్చితో పోలిస్తే 18 శాతం పెరిగింది.