న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: బంగారం భగ..భగ మండుతున్నది. ఇప్పటికే లక్ష రూపాయల పైకి చేరుకున్న పుత్తడి రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఉండటంతోపాటు దేశీయంగా పండుగ సీజన్ కూడా తోడవడంతో పుత్తడి పరుగు పందెంలో విజేతగా నిలుస్తున్నది. ప్రస్తుతం రూ.1.08 లక్షల స్థాయిలో కదలాడుతున్న గోల్డ్ ధర త్వరలో రూ.1.10 లక్షలు అధిగమించే అవకాశాలున్నాయని బులియన్ వర్తకులు చెబుతున్నారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ తులం ధర రూ.850 అధికమై రూ.1,08,620కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.800 పెరిగి రూ.99,600 పలికింది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.870 అధికమై రూ.1,08,490 పలికింది. అంతకుముందు ఇది రూ.1,07,620గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ తులం ధర రూ.800 ఎగబాకి రూ.98,650 నుంచి రూ.99,450 పలికింది. మొత్తం మీద గడిచిన నెల రోజుల్లో గోల్డ్ ధర రూ.7,500 ఎగబాకినట్టు అయింది. వచ్చే రెండువారాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆగని వెండి రేట్లు
బంగారంతోపాటు వెండి పరుగులు పెడుతున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. ఇదే క్రమంలో శనివారం కిలో ధర మరో రూ.2 వేలు ఎగబాకి రూ.1,38,000కి చేరుకున్నది. రిటైల్ మార్కెట్‌తోపాటు ఎంసీఎక్స్ ఫ్యూచర్ మార్కెట్లోనూ పుత్తడి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఈ నెల మొదటి నుంచి ఇప్పటివరకు ఎంసీఎక్స్ ఫ్యూచర్ మార్కెట్లో తులం ధర రూ.3 వేలు ఎగబాకి రూ.1,06,856కి చేరుకున్నది. ప్రస్తుతం స్వల్పంగా తగ్గినప్పటికీ ధరలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావచ్చునని వర్తకులు హెచ్చరిస్తున్నారు.
బంగారం ధరలు పెరగడానికి కారణాలు
నిల్వలను పెంచుకోవడం
బంగారంపై పెట్టుబడులు పెట్టే దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారీగా పెరుగుతున్నారు. దీంతో పసిడికి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, పలు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉండటం ఇందుకు కారణం.
– అక్ష కాంబోజ్, ఐబీజేఏ వైస్ ప్రెసిడెంట్
దీపావళి నాటికి రూ.1.25 లక్షలకు!
ఈ దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరుకునే అవకాశాలున్నాయని బంగారం వర్తకులు చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లోనే ఇంచుమించి పదిగ్రాముల ధర రూ.10 వేల వరకు పెరగడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని, కొనేవారు కరువయ్యారని చెప్పారు. గోల్డ్ ధర లక్ష రూపాయలు దాటి నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని, వచ్చేది పండుగ సీజన్ కావడంతో ఈసారి కూడా పెద్దగా విక్రయాలు ఉండే అవకాశాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అత్యవసరమైతే తప్పా కొనుగోలు చేయడానికి సామాన్యులు ముందుకు రావడం లేదన్నారు.