Rupee @80.05 | అంతర్జాతీయంగా ఫారెక్స్ మార్కెట్లో మన కరెన్సీ రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్‌కే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఎగుమతి, దిగుమతల్లో తీవ్ర వ్యత్యాసం.. కరంట్ ఖాతా లోటు పెరగడం వల్లే డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లపైనే కొనసాగుతున్నది. దేశీయ అవసరాలకు పూర్తిస్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సిందే. ఫలితంగా దిగుమతుల బిల్లు పైపైకి దూసుకెళ్లి కరంట్ ఖాతా లోటును పెంచేసింది. ఇలా కరంట్ ఖాతా లోటు పెరగడం గత 10 ఏండ్లలోనే గరిష్టం. రూపాయి పతనం వల్ల విడి భాగాలు దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కార్లు, కోకింగ్ కోల్, వైద్య పరికరాలు పిరం కానున్నాయి. క్రూడాయిల్ ధర పెరుగుదలతో రవాణా చార్జీల భారం నిత్యావసర వస్తువుల ధరలపై పడనున్నది.
ఇదిలా ఉంటే, ఇటీవల దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకుంటున్నారు. ధరల పెరుగుదల ప్రభావాన్ని కట్టుదిట్టం చేయడానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచేశాయి. ఈయూ దేశాలు, అమెరికా వడ్డీరేట్లు పెంచడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం లేక విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
దీంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇండియన్ కరెన్సీ రూపాయి.. బక్క చిక్కుతున్నది. గోటిపై రోకటిపోటు అన్నట్లు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఆర్థిక మాంద్యం తదితర కారణాల రీత్యా సమీప భవిష్యత్‌లో ముడి చమురు ధర గానీ, దిగుమతి బిల్లు తగ్గే సూచనలే కనిపించడం లేదు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనాన్ని నివారించాలంటే భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమే పరిష్కార మార్గాల్లో ఒకటిగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాదు.. రూపాయి విలువ పతనం కావడంతో వివిధ వస్తువుల ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు.. వాటి విడి భాగాల ఖరీదు, ఖర్చు పెరుగుతుంది. మన కరెన్సీ రూపాయి ఒక్కశాతం క్షీణిస్తే ప్రత్యేకించి మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాల ధర 0.6 శాతం పెరుగుతుంది. ఒకవేళ రూపాయి విలువ ఐదు శాతం పడిపోతే కంపెనీల లాభదాయకత మూడు శాతం తగ్గుతుందని అంటున్నారు.
2022 జనవరి నుంచి ఇప్పటివరకు రూపాయి మారకం విలువ దాదాపు ఏడు శాతం పతనమైంది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు లాభాలు తగ్గించుకునేందుకు అంగీకరించవు. కనుక మొబైల్ ఫోన్ల ధరలు పెరగడం ఖాయం. 2029 నాటికి డాలర్‌పై రూపాయి విలువ రూ.92-95 వరకు పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది.
ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీలు భారత్‌లోనే ఉన్నాయి. ఐటీ పరిశ్రమలకు వచ్చే లాభాలు ఎక్కువగా డాలర్ల రూపంలోనే వస్తాయి. రూపాయిపై అమెరికా డాలర్ బలోపేతం అయ్యే కొద్దీ ఐటీ పరిశ్రమ ఆదాయం వృద్ధి చెందడంతోపాటు మార్జిన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే వైద్య పరికరాల పరిశ్రమను ధరల ఒత్తిళ్లు, సవాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటిపై రవాణా చార్జీల రూపేణా తీవ్ర భారం పడింది. ఉక్కు తయారీలో కోకింగ్‌కోల్ ప్రధాన ముడి సరుకు. ముడి ఇనుముతోపాటు కోకింగ్ కోల్ దిగుమతి వల్ల ఖర్చు పెరుగుతుంది.
రూపాయి పతనాన్ని నివారించాలంటే దేశీయ కంపెనీలు, సంస్థల మధ్య పోటీ తత్వం పెంచి, ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకోవాలి. ముడి చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధార పడుతున్నందున కరంట్ ఖాతా లోటు పెరుగుదలకు కారణం. దీన్ని తగ్గించడానికి సంప్రదాయేతర ఇంధన రంగాలను ప్రోత్సహించాలి. ఇప్పటికే పెరిగిన కరంట్ ఖాతా లోటుకు అడ్డుకట్ట వేయడానికి బంగారం దిగుమతిపై సుంకం పెంచేసింది కేంద్రం. దాంతోపాటు బంగారం దిగుమతులపై పరిమితులు విధించాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
అనవసర వస్తువుల దిగుమతులను నివారిస్తే డాలర్లకు డిమాండ్ పడిపోతుంది. ఎగుమతుల పెంపుతో డాలర్ల ప్రవాహం పెరిగి, రూపాయి బలోపేతం అవుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడంతోపాటు ప్రపంచ దేశాల్లోకి మన ఉత్పత్తులు దూసుకుపోయేలా చర్యలు తీసుకోవాలి. రూపాయిల్లో అంతర్జాతీయ చెల్లింపులు జరుపడానికి వీలుగా వివిధ బ్యాంకులు వోస్ట్రో ఖాతాలు తెరవాలని భారతీయ రిజర్వు బ్యాంక్ సూచించింది. అదే జరిగితే డాలర్ల అవసరం తగ్గుతుంది. రూపాయి బలోపేతం అవుతుంది.