మధ్యతరగతి సొంతింటి కలల్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ చెరిపేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించి మోయలేనంత పన్ను భారాన్ని మోదీ సర్కారు మోపింది మరి. స్థిరాస్తి క్రయవిక్రయాలను ఆందోళనకరం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపట్ల నిర్మాణ రంగ పరిశ్రమ భగ్గుమంటున్నదిప్పుడు.
Union Budget |న్యూఢిల్లీ, జూలై 25: కరోనా ప్రభావం నుంచి నెమ్మదిగా బయటపడిన స్థిరాస్తి రంగం.. మళ్లీ మందగమనంలోకి వెళ్లనుందా? బడ్జెట్లో మోపిన పన్ను భారంతో క్రయవిక్రయాలు పడిపోనున్నాయా? ధరలు పెరిగి సామాన్యుల సొంతింటి కలలు చెదిరిపోతాయా?.. దేశీయ నిర్మాణ రంగాన్ని ఇప్పుడు కుదిపేస్తున్న ప్రశ్నలివే. అవును.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్.. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది మరి.
ఇదీ సంగతి..
పార్లమెంట్లో ఈ నెల 23న (మంగళవారం) ప్రకటించిన వార్షిక బడ్జెట్లో స్థిరాస్తులు, ఇతర ఆర్థిక, ఆర్థికేతర ఆస్తుల అమ్మకాలపై ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌ను తొలగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఇప్పుడు మెజారిటీ ఇండస్ట్రీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ లేదా దీర్ఘకాల మూలధన లాభాలు) పన్నుకు ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తీసేస్తున్నట్టు విత్త మంత్రి వెల్లడించారు.
అలాగే ఎల్టీసీజీ ట్యాక్స్‌ను 12.5 శాతానికి తగ్గిస్తున్నట్టూ చెప్పారు. ఇంతకుముందు ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతంగా ఉండేదిది. అయితే గతంతో పోల్చితే పన్ను శాతం దాదాపు సగానికి తగ్గినా.. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను దూరం చేయడం వల్ల స్థిరాస్తి అమ్మకందారులపై ట్యాక్స్ భారం ఇంకా పెరుగుతుండటమే ఇప్పుడు అందరి ఆందోళనకు కారణమవుతున్నది. ముఖ్యంగా రీ-సేల్ మార్కెట్ కుదేలవుతుందన్న అభిప్రాయాలున్నాయి.
ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే?
2001 తర్వాత కొన్న ఇండ్లను ఇప్పుడు అమ్మితే.. కొనుగోలు చేసిన ధరపై వచ్చిన లాభానికి ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా ఎల్టీసీజీ పన్ను 12.5 శాతం వర్తిస్తుందని బడ్జెట్లో మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే అంతకుముందు (2001 మార్చి 31 లోపు) కొన్న ఇండ్లను అమ్ముకుంటే మాత్రం ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంటుంది. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ (సీఐఐ) నంబర్ల ఆధారంగా లెక్కిస్తారు. 2001-02 నుంచి (2001 ఏప్రిల్ నుంచి) ప్రతీ ఆర్థిక సంవత్సరం ఈ సీఐఐ నంబర్‌ను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ విడుదల చేస్తూ వస్తున్నది.
2001-02లో నాటి ద్రవ్యోల్బణం ఆధారంగా ఇది 100గా ఉన్నది. ఈ బేస్ రేటు (100)నే 2001 కంటే ముందు ఇండ్లు కొన్నవారికి ఇండెక్సేషన్ బెనిఫిట్ లెక్కింపునకు వాడుతున్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఇప్పటి ద్రవ్యోల్బణం రేటు ప్రకారం సీఐఐని 363గా నిర్ణయించారు. దీని ప్రకారం 2001-02 ఆర్థిక సంవత్సరంలో మీరు లక్ష రూపాయలకు ఇల్లు కొంటే.. ప్రస్తుతం దాని విలువ రూ.3.63 లక్షలు అన్నమాట. ఇంతకు మించిన ధరకు ఇల్లును మీరు అమ్ముకుంటే అందులో సదరు రూ.3.63 లక్షలుపోను మిగతా మొత్తానికే ఎల్టీసీజీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటారు. అయితే ఇది పాత పన్ను ప్రకారం. తాజా బడ్జెట్లో చేసిన మార్పుల ప్రకారం ఇంటిని అమ్ముకున్న ధరలో నుంచి కొన్న ధర లక్ష మాత్రమే తీసేస్తారు. మిగతా మొత్తం అంతటికీ పన్ను పడుతుంది.
పాత పన్ను ప్రకారం
2018-19లో రూ.50 లక్షలతో రాజేశ్ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరానికిగాను సీఐఐ 280గా ఉన్నది. 2024-25లో రాజేశ్ ఆ ఇంటిని రూ.70 లక్షలకు అమ్మేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సీఐఐ 363గా ఉన్నది. దీంతో ఇంటిని అమ్మిన ఆర్థిక సంవత్సరం సీఐఐతో.. ఇంటిని కొన్న ఆర్థిక సంవత్సరం సీఐఐని భాగించడం జరుగుతుంది. 363/280=1.296428 వస్తుంది. దీన్ని ఇంటిని కొన్న ధర రూ.50 లక్షలతో గుణిస్తే.. రూ.64,82,142గా ఉంటుంది. ఇంటిని అమ్మడం ద్వారా వచ్చిన రూ.70 లక్షల్లో నుంచి ఈ రూ.64,82,142ను తీసేయాలి. అప్పుడు రూ.5,17,858 వస్తుంది. దీనిపై ఎల్టీసీజీ పన్ను 20 శాతం అంటే రూ.1,03,571.6 చెల్లిస్తే సరిపోతుంది.
కొత్త పన్ను ప్రకారం
అమ్మిన ధర రూ.70 లక్షల నుంచి కొన్న ధర రూ.50 లక్షలను తీసేస్తే.. మిగిలే ఆ రూ.20 లక్షలపై 12.5 శాతం ఎల్టీసీజీ పన్ను చెల్లించాలి. అంటే రూ.2.50 లక్షలు చెల్లించాలి. ఎల్టీసీజీకి ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగించడం వల్ల గతంతో పోల్చితే ఇంటి అమ్మకంపై సుమారు రూ.1.47 లక్షలు అదనంగా ట్యాక్స్‌పేయర్లు చెల్లించాల్సి వస్తున్నదన్నమాట.
ఇండస్ట్రీ వర్గాల ఆందోళనలివీ..