స్పెక్ట్రం వేలానికి సై

- ఆమోదించిన కేంద్ర క్యాబినెట్
- మార్చిలో అమ్మకానికి రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2,251 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రం
- 5జీ తరంగాల జోలికి వెళ్లని మోదీ సర్కార్
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: మరో దఫా స్పెక్ట్రం వేలానికి మోదీ సర్కారు సై అన్నది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 2,251 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రంను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు. 700, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో మొత్తం 2,251.25 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రంను వచ్చే ఏడాది మార్చిలో వేలం వేయాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర న్యాయ, టెలికం, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ స్పెక్ట్రం విలువ (రిజర్వ్ ధర వద్ద) రూ.3,92,332.70 కోట్లుగా పేర్కొన్నారు. ఈ స్పెక్ట్రంను కేంద్రం 20 ఏండ్ల కాలానికి అమ్మనున్నది. ఈ నెలలోనే టెలికం ఆపరేటర్ల నుంచి బిడ్ల ఆహ్వానానికి టెలికం శాఖ నోటీసులు ఇవ్వనుందని ప్రసాద్ తెలిపారు.
5జీపై నిర్ణయమెప్పుడు?
అటు మొబైల్ వినియోగదారులు.. ఇటు టెలికం సంస్థలు 5జీ సేవలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నప్పటికీ 5జీ రేడియో తరంగాల జోలికి కేంద్ర క్యాబినెట్ వెళ్లనేలేదు. వచ్చే ఏడాది ద్వితీయార్ధం నుంచి 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి వస్తాయని రిలయన్స్ జియో ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించింది. నిజానికి ఈ ఏడాది మే నెలలో టెలికం శాఖ అత్యున్నత నిర్ణాయక విభాగమైన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఆమోదించిన రూ.5.22 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రం వేలంలో 5జీ తరంగాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ క్యాబినెట్ సమావేశంలో 5జీ సేవలకు అనువైన 3,300-3,600 మెగాహెట్జ్ బ్యాండ్లలోని ఫ్రీక్వెన్సీల విక్రయానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. 5జీ సంగతేంటి? అన్న ప్రశ్నకూ మంత్రి ప్రసాద్ నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం.
ధరల్ని తగ్గించాలి
5జీ స్పెక్ట్రం బేస్ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని టెలికం సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో టెలికం ఆపరేటర్ 5జీ సేవలకు అవసరమైన స్పెక్ట్రంను పొందాలంటే దాదాపు రూ.50,000 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని టెల్కోలు చెప్తున్నాయి. అయితే 2016లో తీసుకువచ్చిన నిబంధనలే రాబోయే స్పెక్ట్రం వేలం చెల్లింపులకూ వర్తిస్తాయని మంత్రి ప్రసాద్ స్పష్టం చేశారు. స్పెక్ట్రం వేలంలో విజేతలు బిడ్ ధరతోపాటు ఏటా ప్రభుత్వానికి తమ రెవిన్యూ (ఏజీఆర్)లో 3 శాతాన్ని చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు.
మరికొన్ని నిర్ణయాలు
చైనా టెలికం ఎక్విప్‌మెంట్‌పై మరిన్ని ఆంక్షలను అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే టెలికం ఆపరేటర్లు ‘విశ్వసనీయ సంస్థ’ హోదా ఉన్న వాటి నుంచే సాంకేతికతను కొనేలా సెక్యూర్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
విద్యుత్తు రంగంలో సమాచార మార్పిడి కోసం భారత్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందానికీ కేంద్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రిడ్ రిలయబిలిటీని పెంపొందించడంతోపాటు హోల్‌సేల్ పవర్ మార్కెట్ ప్రభావాన్ని పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదని కేంద్రం భావిస్తున్నది.
చెరుకు రైతుల బకాయిలు తీరేలా ప్రస్తుత 2020-21 మార్కెటింగ్ సంవత్సరంలో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి కోసం షుగర్ మిల్లర్లకు రూ.3,500 కోట్ల రాయితీని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.
6 ఈశాన్య రాష్ర్టాల కోసం రూ.6,700 కోట్లుగా సవరించిన పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు వ్యయ అంచనాకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం