Bank Account – Re KYC | ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా నిర్వహిస్తున్నారు. కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్లు తదితర రూపాల్లో మదుపు చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా ముందుగా బ్యాంకుకు, మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లకూ మీ కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలి.
ఖాతాదారుల భద్రత పెంపుతోపాటు మోసాల నివారణకు బ్యాంకులు ఎప్పటికప్పుడు ఖాతాదారుల నుంచి కేవైసీ వివరాలు అప్ డేట్ చేయాలని కోరుతుంటాయి. పలువురు ఈ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో తెలియక ఇబ్బందుల పాలవుతుంటారు. అయితే ఆన్లైన్ లోనే బ్యాంకులు తమ ఖాతాదారులు కేవైసీ అప్ డేట్ చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నాయి. ఖాతాదారులు తమ బ్యాంకు వెబ్ సైట్ లోకి వెళ్లి కేవైసీ అప్ డేట్ చేసుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందామా..!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆన్ లైన్ బ్యాంకింగ్‌లో లాగిన్ కావాలి. అటుపై ‘మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్’ సెక్షన్ కింద కనిపించే ‘అప్ డేట్ కేవైసీ’ మీద క్లిక్ చేయాలి. ఎస్బీఐ ఖాతాను ఎంపిక చేసి.. ‘నెక్ట్స్’ ఆప్షన్ క్లిక్ చేసి సంబంధిత డాక్యుమెంట్లను మీరు అప్ లోడ్ చేయాలి.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులు రీ-కేవైసీ ప్రక్రియను బ్యాంకు వెబ్సైట్లో తేలిగ్గా చేసేసుకోవచ్చు. పోర్టల్‌లో పర్సనల్ విభాగంలో ఈ-కేవైసీ లింక్ ఉంటుంది. లేదంటే బ్యాంకు వెబ్ సైట్ నుంచి సంబంధిత ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని వివరాలు నింపి, సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్ ప్రతులు కలిపి సమీపంలోని బ్యాంకు శాఖలో సమర్పిస్తే సరి.
మరో ప్రైవేట్ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంకు నెట్ బ్యాంకింగ్ పోర్టల్ లో లాగ్ ఇన్ కావాలి. ఒకవేళ మీ కేవైసీ అప్ డేట్ చేయాల్సి వస్తే స్క్రీన్ పైనే చూపుతుంది. అక్కడే కనిపించే ఆథరైజేషన్ బాక్సు మీద టిక్ చేసి ‘అప్ డేట్ త్రూ డాక్యుమెంట్ అప్ లోడ్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. వివరాల్లో మార్పులుంటే వాటిని అప్ డేట్ చేసి పాన్ కార్డ్ డాక్యుమెంట్ అప్ లోడ్ చేయాలి. అడ్రస్ వివరాలు కూడా అక్కడే మార్చుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు ‘కెనరా బ్యాంకు’లో లాగిన్ వివరాలతో బ్యాంక్ వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. అలా లాగిన్ కాగానే ‘సర్వీసెస్’ అనే ఆప్షన్ కింద కనిపించే ‘రీ-కేవైసీ’ మీద క్లిక్ చేసి వివరాలు అప్ డేట్ చేయొచ్చు.
ప్రైవేట్ రంగ బ్యాంకు ‘యెస్ బ్యాంక్’ పోర్టల్ లో లాగిన్ కాగానే ‘రీ-కేవైసీ’ పాప్ అప్ ఉంటది. ఆధార్ అథంటికేషన్‌లో కేవైసీ కంప్లీట్ చేయొచ్చు. అడ్రస్‌లో మార్పులున్నా చేయొచ్చు. పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఈ-ఆధార్ లెటర్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్‌లను అడ్రస్, ఐడీ ప్రూఫ్‌గా అనుమతి ఇస్తారు.