ముంబై, డిసెంబర్ 4 : వరుసగా రెండు పరపతి సమీక్షల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించిన రిజర్వు బ్యాంక్ ఈసారి మాత్రం రేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో ద్రవ్యపరపతి సమీక్షను శుక్రవారం రిజర్వు బ్యాంక్ ప్రకటించనున్నది. కొందరు మాత్రం వరుసగా మూడోసారి కూడా రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య పరపతి కమిటీ సమావేశం మూడు రోజుల పాటు సమావేశమై తన నిర్ణయాన్ని శుక్రవారం ఉదయం ప్రకటించనున్నది. ద్రవ్యోల్బణం ఆధీనంలోకి రావడం, దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పటికీ మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90కి జారుకోవడం రిజర్వుబ్యాంక్‌ను కలవరానికి గురి చేస్తున్నది.