న్యూఢిల్లీ, మే 14 : గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ వెళ్లవచ్చని తెలుస్తున్నది. నిజానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించే రికార్డు స్థాయిలో ఆర్బీఐ నుంచి ఖజానాకు డివిడెండ్ చేరింది. మునుపెన్నడూ లేనివిధంగా ఆ ఏడాదికి రూ.2.11 లక్షల కోట్లు చెల్లించింది మరి. మోదీ హయాంలో కేంద్రానికి అత్యధికంగా ఆర్బీఐ మిగులు నగదు నిల్వలు చేరింది కూడా అప్పుడే. అయితే ఈసారి అంతకుమించి డివిడెండ్ సొమ్ము కేంద్రానికి అప్పగించే యోచనలో ఆర్బీఐ ఉన్నట్టు తెలుస్తున్నది. అదికూడా ఈ నెలలోనే చెల్లింపులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈసారికి రూ.2.5 లక్షల కోట్లు లేదా రూ.3 లక్షల కోట్లదాకా ఆర్బీఐ డివిడెండ్ ఉండవచ్చని అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. డాలర్ ముందు రూపీ క్షీణతను అడ్డుకొనేందుకు కరెన్సీ మార్కెట్లలో ఆర్బీఐ తరచూ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. డాలర్లను అమ్మడం ద్వారా బాగానే రాబడులొచ్చాయి. అలాగే రెపోఆపరేషన్స్తో కూడా ఆర్బీఐకి లాభాలు వచ్చాయని కెనరా బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త జీ మాధవన్‌కుట్టి చెప్తున్నారు.
అందుకే ఈసారి గత రికార్డును తలదన్నేలా ఆల్‌టైమ్ హై స్థాయిలో డివిడెండ్‌ను చెల్లించాలని ఆర్బీఐ యోచిస్తున్నట్టు సమాచారం. ఇక తమ వద్ద ఉన్న మిగులు నగదు నిల్వల పెట్టుబడులపై వచ్చే ఆదాయం, విలువ మార్పుతో డాలర్ నిల్వలపై పొందే లాభం, కరెన్సీ ముద్రణ నుంచి అందుకునే ఫీజులతోనూ ఆర్బీఐ ఆర్జిస్తున్నది. ఏటా ఇందుకుగాను ప్రభుత్వానికి డివిడెండ్‌ను ప్రకటిస్తూ ఉంటుంది.