Crypto | క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ 2009లో విపణిలో చలామణిలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత నాలుగేండ్లకు 2013 క్రిస్మస్ వేడుకల ముంగిట క్రిప్టో కరెన్సీతో భద్రతాపరమైన, ఆర్థిక, చట్టపరమైన ముప్పు గురించి ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాదు క్రిప్టో కరెన్సీలు బలోపేతం అయ్యాక అంటే.. ఆవిర్భవించిన ఎనిమిదేండ్లకు వాటిపై నిషేధం విధించింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలోనూ క్రిప్టో కరెన్సీలను పూర్తిగా నిషేధించాల్సిందేనని వాదించింది. పరిమిత ఆంక్షలు పని చేయబోవని స్పష్టం చేసింది.
2018లో భారత్‌లో క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌ను సమర్థవంతంగా నిషేధించాలని ఆర్బీఐ ఆదేశించినా.. కానీ బ్యాంకర్లు ఆ పని చేయలేకపోయాయి. గతేడాది సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలను పక్కన బెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా నిరంతరం క్రిప్టో కరెన్సీలు దేశ ఆర్థిక సుస్థిరతకు ముప్పని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలు స్వేచ్ఛగా సాగేందుకు అనుమతి ఇస్తే.. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానంతో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. బ్యాంకులు, ఇతర నియంత్రణ సంస్థలను వర్చువల్ కరెన్సీలు లెక్క చేయకపోవచ్చు.
క్రిప్టో కరెన్సీల ధరలు పూర్తిగా అనిశ్చితిని, ఒడిదొడుకులను ఎదుర్కొంటాయి. వాటి ట్రాన్సాక్షన్స్‌ను ట్రేస్ చేయడం కష్టతరం అవుతుంది. డిజిటల్ కరెన్సీ ద్వారా వచ్చే నిధులు డాలర్ల రూపంలోనే రావాలని కూడా లేదు. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారక ద్రవ్య మార్పిడి ముప్పును తీసుకొస్తుందని ఆర్బీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్రిప్టో కరెన్సీలు ముప్పుగా పరిణమిస్తారని హెచ్చరించారు.
చట్ట విరుద్ద మార్గాల్లో నిధులు పంపిణీ కావడం పట్ల ఆందోళన చెందుతున్న ఆర్బీఐ.. క్రిప్టో కరెన్సీలను ఒక కరెన్సీగా గానీ, ఆస్తిగా గానీ గుర్తించడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తున్నది. క్రిప్టో కరెన్సీలపై ఎటువంటి వ్యూహాలను అమలు చేయాలన్న అంశంపై కేంద్రం ఇంకా నిర్ణయానికి రాలేదు. ఇటీవల ముగిసిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టోల నియంత్రణకు బిల్లు ప్రవేశపెడతారని వార్తలొచ్చినా ఆచరణలో జరుగలేదు. పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తే.. ప్రపంచ దేశాలతో సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయేమోనన్న ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
క్రిప్టోలను చట్టబద్దమైన కరెన్సీగా గుర్తించే అవకాశమే లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగని నిషేధం విధించాలన్న విషయమై చాలా ఆలస్యం అయిందంటున్నారు. ఇప్పటికే క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల భవిష్యత్ దెబ్బ తినకుండా కేంద్రం బ్యాలెన్సింగ్ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్రిప్టోలను ఇన్వెస్ట్మెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌గా పరిగణించడంతోపాటు వాటి నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టనున్నదని తెలుస్తున్నది. సెబీ ఆధ్వర్యంలో దీని నియంత్రణకు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.