CS Setty | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఆహార ద్రవ్యోల్బణం దెబ్బకు రుణాలపై వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అంచనా వేశారు. ఆర్బీఐ రాబోయే అక్టోబర్, డిసెంబర్ నెలల్లో చేపట్టే విధాన సమీక్షల్లోనూ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే వీలుందని తాజాగా అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాదికైతే ఇంతేనన్న ఆయన.. వచ్చే ఏడాదిలోనే వడ్డీరేట్ల కోతకు అవకాశాలున్నాయని చెప్పారు. వడ్డీరేట్లకు ఫెడ్ రిజర్వ్ తాజాగా అరశాతం కోతపెట్టిన నేపథ్యంలో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులూ కోతలకు దిగే వీలున్నది. అయినప్పటికీ శెట్టి పైవిధంగా స్పందించడం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ప్రతీ సెంట్రల్ బ్యాంక్‌ను ప్రభావితం చేస్తుంది. కానీ ఆర్బీఐ మాత్రం ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొనే వడ్డీరేట్ల తగ్గింపుపై ఓ నిర్ణయానికి వస్తుంది’ అని పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించే వీలుందని ఎస్బీఐ చీఫ్ అంచనా వేశారు. ఆహార ద్రవ్యోల్బణం అప్పటికి శాంతించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్ 7-9 తేదీల్లో ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ఉన్నది. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతం వద్ద ఉన్నది.