ముంబై: మీ బ్యాంకు ఏటీఎంలో నగదు విత్ డ్రాయల్ కోసం వెళితే.. సారీ.. అవుటాఫ్ క్యాష్.. మీకు కలిగిన అంతరాయానికి మన్నించండి. మరో ఏటీఎంను సంప్రదించండి.. అనే మెసేజ్ వస్తుందా?… అత్యవసర సమయాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోతే ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.. నగదు లేమితో ఏటీఎం మిషన్లు గంటల తరబడి ఖాళీగా ఉంటున్న విషయం ఆర్బీఐ ద్రుష్టికి వచ్చింది.. అందుకే బ్యాంకర్లు, ఏటీఎం ఆపరేటర్లపై కన్నెర్ర చేసింది.
ఇక నుంచి ఏటీఎంల్లో పది గంటలకు పైగా నగదు లేకపోతే సంబంధిత బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లపై రూ. 10 వేల వరకు పెనాల్టీ విధిస్తామని ప్రతిపాదించింది. ఈ మేరకు నూతన నిబంధనలు వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
వివిధ బ్యాంకుల ఏటీఎంలు నగదు లేక ఖాళీగా ఉండటంతో సాధారణ ప్రజానీకం అసౌకర్యానికి గురవుతున్నారని తమ సమీక్షలో తేలిందని మంగళవారం ఆర్బీఐ తెలిపింది. సకాలంలో ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉండేలా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్ఏవోస్) తమ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించింది.
నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే సంబంధిత బ్యాంకర్లు, ఏటీఎం ఆపరేటర్లపై పెనాల్టీ విధిస్తామని పేర్కొంది. ఆ పెనాల్టీని ఆయా ఏటీఎం వద్ద నుంచి వసూలు చేసే అధికారాన్ని బ్యాంకర్లకే వదిలేస్తున్నట్లు వెల్లడించింది.