Gold Reserves : బ్రిటన్ నుంచి ఆర్బీఐ దాదాపు 100 టన్నుల (లక్ష కిలోల) బంగారాన్ని భారత్‌లోని తన ఖజానాలకు తరలించింది. భారీ మొత్తంలో బంగారం నిల్వలను ఈ స్ధాయిలో భారత్ స్వదేశంలో నిల్వ చేసేందుకు రప్పించడం 1991 నుంచి ఇదే తొలిసారి. ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వల్లో సగానికి పైగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో సెక్యూర్ కస్టడీలో ఉన్నాయి.
మూడింట ఓ వంతు గోల్డ్ రిజర్వ్‌లు మాత్రమే దేశీయ నిల్వలున్నాయి. ఆర్బీఐ తీసుకున్న తాజా చర్యతో పెద్దమొత్తంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు చెల్లిస్తున్న స్టోరేజ్ వ్యయం ఆదా అవుతుందని భావిస్తున్నారు. 2024 మార్చి 31 నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో భాగంగా ఆర్బీఐ వద్ద 822.10 టన్నుల బంగారం నిల్వలున్నాయి.
ఆర్బీఐ వెల్లడించిన వార్షిక డేటా ప్రకారం గత ఏడాది ఇదే సమయంలో ఆర్బీఐ వద్ద 794.63 టన్నుల గోల్డ్ రిజర్వ్‌లు ఉన్నాయి. బ్రిటన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం రిజర్వ్‌లను ఆర్బీఐ వెనక్కిరప్పించిందని, దీంతో భారత్ తన బంగారం నిల్వల్లో అధిక శాతం తన ఖజానాల్లోనే భద్రపరిచినట్లయిందని ప్రముఖ ఆర్ధికవేత్త సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు.
1991 చెల్లింపుల సంక్షోభం నేపధ్యంలో మన బంగారం నిల్వలు దేశం దాటిన పరిస్ధితిని మనం మరువలేమని, అప్పటి సంక్షోభ స్ధితి నుంచి నేడు బంగారం నిల్వలను దేశానికి రప్పించడం ఓ ప్రత్యేక సందర్భంగా గుర్తుంచుకోవచ్చని వ్యాఖ్యానించారు.
Read More :
Prajwal Revanna | ఎట్టకేలకు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్..