UPI Lite | ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే.. చిన్న మొత్తాల నుంచి భారీ బిల్లుల వరకూ అంతా డిజిటల్ మయమే. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఆర్బీఐ.. చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం యూపీఐ లైట్ (UPI Lite) లో ఆటోమేటిక్గా మనీ లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రతిపాదించింది. ఈ విధానం అమల్లోకి వస్తే పేమెంట్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు చెల్లింపులకు వినియోగించే ఫాస్టాగ్ (Fastag) కు కూడా ఇదే పాలసీ అమలు చేయాలని సూచించింది ఆర్బీఐ.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)లో తేలికైన వర్షన్ ఈ యూపీఐ లైట్. ఇది యూజర్లకు వాలెట్ మాదిరిగా పని చేస్తుంది. దీని ద్వారా జరిపే పేమెంట్స్ కోసం ‘పిన్’ నంబర్ వాడాల్సిన అవసరం లేదు. వాలెట్ మాదిరిగా వాడే ‘యూపీఐ లైట్’లో గరిష్టంగా రూ.2000 వరకూ లోడ్ చేయొచ్చు. ఒకరోజు రూ.2000 వరకు మాత్రమే ట్రాన్సాక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఒకేసారి రూ.500 మాత్రమే చెల్లించడానికి వీలుంది.
యూపీఐ లైట్ వినియోగాన్ని మరింత విస్తృత పర్చడానికి ఈ-మ్యాండేట్ విధానం తేవాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. యూపీఐ లైట్లో నిర్ధిష్ట పరిమితి కంటే తక్కువ మనీ ఉంటే.. సంబంధిత యూజర్ బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా సొమ్ము లోడ్ అవుతుంది. అందుకు యూజర్ తన యూపీఐ లైట్ సెట్టింగ్స్ సెట్ చేసుకోవాలి. ఇటీవలి కాలంలో రికరింగ్ పేమెంట్స్కు ఈ-మ్యాండేట్ వాడకం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎంసీ) వంటి వాటికి ఆటో లోడ్ సౌకర్యం ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.