RBI | ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలపై పెనాల్టీ విధించినట్లు శుక్రవారం ఆర్బీఐ వెల్లడించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుపై రూ.కోటి, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థపై రూ.49.70 లక్షల పెనాల్టీ విధించామని తెలిపింది. ‘లోన్స్ అండ్ అడ్వాన్సెస్ – స్టాచుటరీ అండ్ అదర్ రిస్ట్రిక్షన్స్’ నిబంధనలను అమలు చేయనందుకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుపై జరిమాన విధించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. ఒక ఎన్బీఎఫ్సీ సంస్థగా తమ కస్టమర్లతో లావాదేవీలు, అగ్రిమెంట్లు చేసుకునే సమయంలో నిబంధనలను ఉల్లంఘించిందని మరో ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. ఎన్బీఎఫ్సీ-హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (రిజర్వు బ్యాంక్) మార్గదర్శకాలు-2021 అమలు చేయడంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ విఫలమైందని వివరించింది.
మరోవైపు కుందెల్స్ మోటార్ ఫైనాన్స్, నిత్య ఫైనాన్స్, భాటియా హైర్ పర్చేజ్, జీవన్ జ్యోతి డిపాజిటర్స్ అండ్ అడ్వాన్సెస్ అనే నాలుగు ఎన్బీఎఫ్సీ సంస్థల `సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీఓఆర్) రద్దు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. దీంతో ఈ నాలుగు సంస్థలు ఒక ఎన్బీఎఫ్సీ సంస్థగా లావాదేవీలు నిర్వహించలేవు. వీటితోపాటు గ్రోయింగ్ ఆపర్చునిటీ ఫైనాన్స్ (ఇండియా), ఇన్వెల్ కమర్షియల్, మోహన్ ఫైనాన్స్, సరస్వతి ప్రాపర్టీస్, క్వికర్ మార్కెటింగ్ సంస్థలు కూడా తమ సీఓఆర్ను ఆర్బీఐకి సరెండర్ చేశాయి.