న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: శరవేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులను రిజర్వ్‌బ్యాంక్ ఎప్పటికప్పుడు విశ్లేషించి, అందుకు అనుగుణంగా విధాన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఇటీవల జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్‌ను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. ఈ మినిట్స్ ప్రకారం కమిటీలోని మిగిలిన ఐదుగురు సభ్యులూ దాస్ అభిప్రాయంతో ఏకీభవించారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టాలని ఏప్రిల్ 6-8 తేదీల మధ్య సమావేశమైన ఎంపీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నాయని, 1980 తర్వాత ఎన్నడూ లేనంతగా ధనిక దేశాల్లో ద్రవ్యోల్బణం 5 శాతానికిపైగా పెరిగిందని, వర్థమాన దేశాల్లో 7 శాతాన్ని మించిపోయిందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖల్ దేబబ్రత పాత్రా కమిటీ సమావేశంలో వివరించారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే చర్యల్ని తీసుకోవాల్సిన ఆవశ్యకతను కమిటీ సభ్యులు నొక్కిచెప్పారు.