Poonam Gupta | ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త పూనమ్ గుప్తా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియామకమయ్యారు. 2025 ఏప్రిల్ 7-9 మధ్య జరగనున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ఆమెను డిప్యూటీగా గవర్నర్‌గా నియమించింది. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ప్రతి రెండునెలలకోసారి జరిగే విషయం తెలిసిందే. పూనమ్ గుప్తా మూడ సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆమె ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్(NCAER) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యురాలిగా, 16వ ఆర్థిక కమిషన్‌కు సలహా మండలి కన్వీనర్‌గా కూడా పనిచేస్తున్నారు. జనవరిలో మైఖేల్ దేబబ్రత పాత్ర రాజీనామా తర్వాత.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంటూ వస్తున్నది.
ఈ క్రమంలో ఆమె నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె దాదాపు రెండు దశాబ్దాల పాటు వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకులో సీనియర్ పదవులలో పని చేశారు. 2021లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్‌లో చేరారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ (USA)లో పాఠాలు బోధించారు. ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా సేవలందించారు. పూనమ్ గుప్తా అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. 1998లో అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంపై పీహెచ్డీ చేసినందుకు ఆమె ఎగ్జిమ్ బ్యాంక్ బహుమతికి ఎంపికయ్యారు.