ముంబై, ఏప్రిల్ 8: రిజర్వు బ్యాంక్ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ద్వై-పాక్షిక ద్రవ్యపరపతి సమీక్షను బుధవారం ప్రకటించబోతున్నారు. ఈ సారి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా. ఫిబ్రవరి సమీక్షలోనూ ఆర్బీఐ వడ్డీరేట్లను పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. మే 2020 తర్వాత తొలిసారీగా వడ్డీరేట్లలో కోత పెట్టింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ బ్యాంకులు క్రమంగా వడ్డీరేట్లను తగ్గిస్తుండటం, ట్రంప్ టారిఫ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి ఈసారి సమీక్షలో వడ్డీరేట్లను కోత పెట్టాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం ఉదయం 10గంటలకు ఆర్బీఐ తన సమీక్షను ప్రకటించబోతున్నది.