ముంబై, డిసెంబర్ 7: రిజర్వ్‌బ్యాంక్ మరో దఫా కొరడా విదిలించింది. ఏడు నెలల్లో ఐదోసారి వడ్డీ రేట్లను పెంచింది. మూడు రోజుల పరపతి విధాన సమీక్ష అనంతరం రెపో రేటును మరో 35 బేసిస్ పాయింట్ల (0.35 శాతం) మేర పెంచాలని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. తాజా పెంపుతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటివరకూ 2.25 శాతం రేట్లను అధికంచేసింది. ఆర్బీఐ వాణిజ్య బ్యాంక్‌లకు ఇచ్చే రుణాలపై వసూ లు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. కేంద్ర బ్యాంకే అధిక రేట్లను వసూలు చేస్తున్నందున, వాణిజ్య బ్యాంకులు సైతం ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను సహజంగానే పెంచేస్తాయి. ఆరుగురు సభ్యులున్న ఎంపీసీలో ఐదుగురు రెపో రేటును 6.25 శాతానికి చేర్చాలని ఓటు చేశారు.అలాగే సరళతర ద్రవ్య విధానాన్ని క్రమేపీ ఉపసంహరించేందుకు నలుగురు సభ్యులు మొగ్గుచూపారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఎంపీసీ నిర్ణయాల్ని దాస్ వెల్లడిస్తూ ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ పోరు ఆగదని, ధరల్ని అదుపులో ఉంచేందుకు ఆచితూచి ద్రవ్య విధాన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుందని కమిటీ అభిప్రాయపడిందన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి పరపతి సమీక్షలో రిజర్వ్‌బ్యాంక్ మరోదఫా వడ్డీ రేట్లను పెంచవచ్చని రేటింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ వైఖరి కఠినంగానే ఉన్నందున మరో రౌండు రేట్ల పెంపు ఉంటుందని, దాంతో రెపో రేటు 6.5 శాతానికి చేరవచ్చని యాక్యుటే రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. అధిక వడ్డీ రేట్లు హౌసింగ్ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, ప్రత్యేకించి మిడ్, హై రేంజ్ విభాగంలో డిమాండ్ తగ్గుతుందని తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాల్ని ఆర్బీఐ మరోసారి తగ్గించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కఠిన అంతర్జాతీయ ద్రవ్య పరిస్థితుల కారణంగా 2022-23లో ఆర్థికాభివృద్ధి రేటు 6.8 శాతానికే పరిమితమవుతుందని రిజర్వ్‌బ్యాంక్ అంచనా వేసింది. ఈ అంచనాల్లో ఇప్పటికే రెండు దఫాలు, 7.8 శాతం నుంచి 7.2 శాతానికి, అటుతర్వాత 7 శాతానికి కత్తెర వేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పూర్తి సంవత్సరానికి 6.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.4 శాతం, నాల్గో త్రైమాసికంలో 4.2 శాతం చొప్పున వృద్ధి రేటును దాస్ అంచనా వేశారు. 2023-24 ఏప్రిల్-జూన్‌లో జీడీపీ 7.1 శాతానికి, ఆ తదుపరి త్రైమాసికంలో 5.9 శాతం వృద్ధిచెందుతుందని భావిస్తున్నామన్నారు.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వేదికలో ఓ అదనపు సౌకర్యాన్ని తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ-కామర్స్ కొనుగోళ్లు, హోటల్ బుకింగ్స్, సెక్యూరిటీల్లో పెట్టుబడులు, షేర్ లావాదేవీల్లో కస్టమర్లకు ఉపయోగకరంగా ఈ ఫీచర్ ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ‘సింగిల్-బ్లాక్-అండ్-మల్టిపుల్ డెబిట్స్’ ఫీచర్ ద్వారా యూపీఐపై మరింత విశ్వసనీయ లావాదేవీలను వినియోగదారులు జరుపుకోవచ్చని చెప్పింది.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై ప్రజల్లో అనవసరపు భయాలను సృష్టించవద్దని ఆర్బీఐ గవర్నర్ దాస్ కోరారు. సీబీడీసీని సమర్థవంతంగా చలామణిలోకి తెస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈడీ వంటి ఏజెన్సీలు దాడులు చేసే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నగదుపై ఐటీ శాఖ నిబంధనలే సీబీడీసీకి కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు.