ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతీ ద్రవ్యసమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గిస్తూనే ఉన్నది. గత మూడు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) తగ్గించింది. ఇటీవలి ద్రవ్యసమీక్షలోనైతే ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) కోత పెట్టింది. దీంతో బ్యాంకులూ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేస్తున్నాయి. పైగా తాజా ద్రవ్యసమీక్షలో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని 1 శాతం తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా రూ.2.5 లక్షల కోట్ల నిధులు వచ్చేలా చేస్తున్నది. ఫలితంగా ఇప్పుడు బ్యాంకులకు నగదు కొరతనే లేకుండా పోతున్నది. దాంతో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)కు అధిక వడ్డీరేట్లు ఇవ్వాల్సిన పరిస్థితి బ్యాంకులకు లేదనే చెప్పొచ్చు. అటుఇటుగా అన్ని బ్యాంకులూ తమ ఎఫ్డీలపై వడ్డీరేట్లను సవరిస్తూపోతున్నాయిప్పుడు. ఇప్పటికే ఎఫ్డీలపై వడ్డీరేట్లు 30-70 బేసిస్ పాయింట్లు తగ్గాయని ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక చెప్తున్నది.
ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్టర్లు తమ రాబడులు వేగంగా తగ్గిపోతున్నాయన్నది గుర్తుంచుకోవాలి. రెపో రేటు 5.50 శాతానికి దిగింది. గత ఏడాది వరకు ఇది 6.50 శాతంగా ఉండేది. నిజానికి ద్రవ్యోల్బణం ఇప్పుడు ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయికి దిగువనే ఉన్నది. ఈ క్రమంలో జీడీపీ బలోపేతంపైనే ఆర్బీఐ దృష్టి పెడుతుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లోనూ రెపో రేటు మరింతగా తగ్గే వీలు లేకపోలేదు. ఇదే జరిగితే ఎఫ్డీలపై పెట్టుబడులు నిరర్థకమే. ముఖ్యంగా సంప్రదాయ ఇన్వెస్టర్లు, సురక్షిత పెట్టుబడులను ఆశించే సీనియర్ సిటిజన్లకు ఇది ఇబ్బందికరమే. సేవింగ్స్ అకౌంట్లపైనా వడ్డీరేట్లు 2.7 శాతానికి దిగజారిపోయాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీలపైనా ఇంచుమించుగా ఇదే స్థాయిలో వడ్డీరేట్లు స్థిరపడే అవకాశాలున్నాయి. మరి నిపుణులు ఏం చెప్తున్నారు.
కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్డీలపై 8 శాతం, అంతకన్నా ఎక్కువ వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు దిగేవారు ఈ బ్యాంకుల్లో తమ నగదును డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) రూ.5 లక్షల కవరేజీకి అనుగుణంగా మీ ఎఫ్డీలు ఉండేలా చూసుకోవాలి. అధిక వడ్డీరేట్లకు ఆశపడి ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేస్తే సదరు బ్యాంకులు ఒకవేళ బోర్డు తిప్పేస్తే రిస్కులో పడుతారు. కనుక అన్నిరకాలుగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం వివేకం. సీనియ ర్ సిటిజన్ల పేరిట ఎఫ్డీలు చేసినా అధిక వడ్డీరేట్లను పొందవచ్చు. ఆయా బ్యాంకు లిస్తున్న స్పెషల్ ఎఫ్‌డీలనూ పరిశీలించండి.
డిపాజిటర్లు తమ దగ్గర పెద్ద ఎత్తున నగదు నిల్వలుంటే వాటిని చిన్న చిన్న ఎఫ్‌డీలుగా మదుపు చేయడం తెలివైన పని. సింగిల్ డిపాజిట్ల కంటే మల్టీపుల్ డిపాజిట్లు ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఒకే టెన్యూర్‌పై కాకుండా రకరకాల టెన్యూర్స్‌లో వీటిని డిపాజిట్ చేయడం వల్ల మన అవసరాలకు అనుగుణంగా తిరిగి పొందవచ్చు. లేకపోతే ముందస్తు విత్‌డ్రాలతో జరిమానాలు పడి వడ్డీ లాభాలను కోల్పోవాల్సి వస్తుంది.
చిన్న మొత్తాలను దీర్ఘకాలిక వ్యవధులకు ఫిక్స్డ్ చేసుకుంటే లాభదాయకం. 2-3 ఏండ్ల టెన్యూర్‌కు బదులుగా, అంతకంటే ఎక్కువ టెన్యూర్‌ను ఎంచుకొంటే వడ్డీరేట్ల హెచ్చుతగ్గుల నుంచి లబ్ధి పొందవచ్చు.