న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ద్రవ్యోల్బణం పట్ల రిజర్వ్‌బ్యాంక్ ‘అత్యంత అప్రమత్తం’గా ఉంటుందని, ఈ రేటు 4 శాతానికి తగ్గేలా చూస్తుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. తద్వారా అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలిచ్చారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ నిర్వహించిన సదస్సులో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ధరల్ని అదుపు చేయడంపైనే ద్రవ్య విధానం దృష్టిపెడుతుందని, ప్రస్తుతం దిగివస్తున్న ద్రవ్యోల్బణం సజావుగా మరింత తగ్గేలా చూస్తుందన్నారు.
అక్టోబర్ 6నాటి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కేంద్ర బ్యాంక్ వరుసగా నాల్గవసారి వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టిన సంగతి తెలిసిందే. దాస్ తాజా కఠిన వ్యాఖ్యలతో డాలరు మారకంలో రూపాయి విలువ శుక్రవారం బలపడి 83.08 స్థాయికి చేరింది. ఇటీవల రూపాయిపై ఏర్పడిన ఒత్తిడిని ఆర్బీఐ గవర్నర్ ప్రస్తావిస్తూ డాలరు బలపడటమే ఇందుకు కారణమని, అధిక ఒడిదుడుకుల్ని నిరోధించడానికి కేంద్ర బ్యాంక్ తరచూ కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటున్నదని అన్నారు. ఆర్బీఐ సెప్టెంబర్ సర్వేల్లో ప్రోత్సాహకర సంకేతాలు వెల్లడయ్యాయని, ద్రవ్యోల్బణం అంచనాల తగ్గుదలలో మరింత ప్రగతి కనపడుతున్నదని చెప్పారు. అయితే ఆహార ద్రవ్యోల్బణంపై పలు అనిశ్చితుల ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.
ప్రజల వద్ద ఇంకా రూ. 10,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నాయని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ నోట్లు సైతం తమ వద్దకు తిరిగి వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్ 7తో బ్యాంక్ శాఖలు ఈ నోట్లను తీసుకోవడం నిలిపివేయగా, అక్టోబర్ 8 నుంచి ఆర్బీఐ కార్యాలయాల్లో మార్పిడికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఒక దఫాలో రూ.20,000 వరకూ ఈ పెద్ద నోట్లను మార్చుకోవచ్చు. ఆర్బీఐ కార్యాలయాల ద్వారా వ్యక్తులు, సంస్థల బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి ఎటువంటి పరిమితీ లేదు.