ముంబై, ఫిబ్రవరి 15: ఓవైపు ఆహారోత్పత్తుల ధరలు మళ్లీమళ్లీ పెరుగుతూ షాకిస్తున్నాయని, మరోవైపు భౌగోళిక-రాజకీయ పరిణామాలు ఆందోళనకరంగా తయారవుతున్నాయని.. ఇవి ద్రవ్యోల్బణం అదుపునకు సవాళ్లు విసురుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. గురువారం ఇక్కడ ఆర్బీఐ అధ్యక్షతన జరిగిన 59వ ఆగ్నేయాసియా దేశాల సెంట్రల్ బ్యాంక్ (ఎస్ఈఏసీఈఎన్) గవర్నర్ల సదస్సులో దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక మార్పులు: కొత్త సంక్లిష్టతలు, సవాళ్లు, విధాన ఎంపికలు’ అన్న అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే స్థిరమైన, తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం నిలకడైన ఆర్థికాభివృద్ధికి అవసరమైన పునాదుల్ని వేస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ అనేక సవాళ్లను విజయవంతంగా అధిగమించిందన్న ఆయన తద్వారా వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. ‘ఈ అల్లకల్లోల పరిస్థితుల్లో భారత్ విజయాలకు బాటలు వేసింది తెలివైన ఆర్థిక, ద్రవ్య విధానాలే’ అన్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశ జీడీపీ 7 శాతంగా నమోదు కావచ్చన్న దాస్.. 7 శాతం ఎగువన వృద్ధిరేటు ఉండటం ఇది వరుసగా నాల్గో సంవత్సరమని గుర్తుచేశారు.
భారత్‌లో జరుగుతున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు.. వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థకు కీలకమయ్యాయన్నారు. ఇతర దేశాల్లోనూ యూపీఐ చెల్లుబాటు.. దీన్ని ఓ అంతర్జాతీయ మాడల్‌గా చేస్తున్నదని చెప్పారు. ఇక కరోనా సమయంలో సాగిన యూపీఐ లావాదేవీలు.. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై నమ్మకాన్ని పెంచేలా చేశాయని అభిప్రాయపడ్డారు.