న్యూఢిల్లీ, జూన్ 18: భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు మధ్యంతర చైర్మన్‌గా ఈ ఏడాది సెప్టెంబర్దాకా కెకీ మిస్త్రీ కొనసాగుతారు. ఆయన పదవీకాలాన్ని 3 నెలలపాటు పొడిగింపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఆమోదం లభించినట్టు గురువారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలియజేసింది. బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా నేపథ్యంలో మిస్త్రీని ఈ ఏడాది మార్చి 18న మధ్యంతర చైర్మన్‌గా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నియామకం గడువు ముగియడంతో సెప్టెంబర్ 18దాకా లేదా రెగ్యులర్ పార్ట్-టైమ్ చైర్మన్ నియామకం అయ్యేదాకా ఏది త్వరగా జరిగితే అప్పటివరకు మిస్త్రీ కొనసాగవచ్చని ఆర్బీఐ అనుమతిచ్చింది.