ముంబై, ఫిబ్రవరి 7: మంగళవారం నుంచి ప్రారంభంకాబోయే రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ కమిటీ సమావేశం..పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై దృష్టి నిలుపుతుందని, దీని అదుపునకు అవసరమైన చర్యల్ని ప్రకటిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యవస్థలో డబ్బు చెలామణీని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణానికి ఆర్బీఐ కళ్లెం వేసే ప్రయత్నం చేస్తుందని, ఈ క్రమంలో రివర్స్ రెపో రేటును పెంచవచ్చని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. బ్యాంకులు…తన వద్ద ఉంచే డిపాజిట్లకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపోగానూ, ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలకు వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగానూ వ్యవహరిస్తారు. రివర్స్ రెపో పెంపువల్ల గృహ రుణాలు, ఆటోమొబైల్ రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశం తక్కువ. కానీ టెర్మ్ డిపాజిట్లపై ఎక్కువ రేట్లను బ్యాంక్‌లు ఆఫర్ చేయవచ్చు. రివర్స్ రెపో రేటును పెంచడం ద్వారా ఆర్బీఐ…వ్యవస్థలో లిక్విడిటీని ఆకర్షించడంతో చెలామణీని తగ్గించడం సాధ్యపడుతుంది. కొవిడ్-19 నేపథ్యంలో పూర్తిగా సరళీకరించిన ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తెచ్చేక్రమంలో తొలి అడుగుగా రివర్స్ రెపోను పెంచవచ్చని భావిస్తున్నారు. ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాపసూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున, సోమవారం ప్రారంభంకావాల్సిన ఆర్బీఐ కమిటీ సమావేశం ఒక రోజు వాయిదా పడింది. ఫిబ్రవరి 8న మొదలై 10న ఈ సమీక్ష ముగుస్తుంది. అదే రోజున ఆర్బీఐ తాజా పాలసీ నిర్ణయాల్ని వెల్లడిస్తుంది.
ఇతర కేంద్ర బ్యాంక్‌లకంటే సరళమే..
ఇతర ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌లకంటే రిజర్వ్‌బ్యాంక్ విధానం సరళంగానే కొనసాగుతుందని విశ్లేషకులు చెపుతున్నారు. రుణాలపై వడ్డీ రేట్లను పెరిగేందుకు వీలుకల్పించే రెపో రేటును ఆర్బీఐ పెంచకపోవొచ్చని వారన్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, అదే బాటను యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సైతం ఎంచుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గతవారమే రెండో దఫా వడ్డీ రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరుగుతున్నా, ఇక్కడ డిమాండ్ ఇంకా బలహీనంగా ఉన్నందున ఆర్బీఐ విధానం ఇప్పట్లో కఠినతరం కాబోదని, లిక్విడిటీని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని చూస్తుందన్న అంచనాల్ని బార్క్లేస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ బజోరియా వ్యక్తం చేశారు. ఆర్బీఐ నిర్దేశించుకున్న శ్రేణికి పైస్థాయిలో ద్రవ్యోల్బణం ఉన్నందున, రానున్న నెలల్లో ద్రవ్య విధానాన్ని క్రమేపీ కఠినతరం చేయవచ్చని భావిస్తున్నామన్నారు. ప్రస్తుత సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచవచ్చని, రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చని ఎడెల్వీజ్ ఒక రీసెర్చ్ రిపోర్ట్‌లో తెలిపింది. ప్రస్తుతం రిజర్వ్‌బ్యాంక్ రెపో రేటు రికార్డు కనిష్ఠస్థాయి 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఉంది.