Illegal Forex Trading | చట్ట విరుద్ధ ఫారెక్స్ ట్రేడింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ అడుగులేస్తున్నది. అక్రమ ఫారెక్స్ ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ చానెళ్లను దుర్వినియోగం చేయకుండా కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ అధికారలుతో సంప్రదింపులు జరిపింది. ఫారెక్స్ ట్రేడింగ్ విషయమై ప్రజల్లో భారీ స్థాయిలో అవగాహన కల్పించడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్ని వాటాదారులకు ఆర్బీఐ లేఖ రాసింది. ఈ విషయమై చట్ట విరుద్ధ ఫారెక్స్ ట్రేడింగ్ లావాదేవీలకు పాల్పడిన ప్లాట్ ఫామ్స్, వెబ్ సైట్లతోపాటు 75 సంస్థలపై హెచ్చరికలు జారీ చేసింది ఆర్బీఐ.
ఈ ఏడాది ప్రారంభంలో చట్ట విరుద్ధంగా ఫారెక్స్ ట్రేడింగ్ జరిపిన ఇద్దరు వ్యాపార వేత్తలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తులో సదరు వ్యాపారులు కోల్‌కతా కేంద్రంగా 180 బ్యాంకు ఖాతాలతో లావాదేవీలు జరిపినట్లు తేలింది. దీంతో ఆయా ఖాతాల్లో రూ.120 కోట్ల నిధులు జప్తు చేసింది.
‘పలు యాప్స్‌తోపాటు అనధికారిక ప్లాట్‌ఫామ్స్ జరిపే ఫారెక్స్ ట్రేడింగ్, లావాదేవీలపై మరింత సునిశితంగా తనిఖీ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ వర్గాలు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. తమ ఖాతాదారులంతా కేవైసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. సోషల్ మీడియా, సెర్చింజన్లు, గేమింగ్ యాప్స్, ఇతర ప్లాట్‌ఫామ్స్ నుంచి వెలువడుతున్న తప్పుదారి పట్టించే ప్రకటనలను ఆర్బీఐ గుర్తించింది. అనధికారిక ప్లాట్‌ఫామ్స్‌లో ఫారెక్స్ లావాదేవీలు నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు.. విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య చట్టం-1999 (ఫెమా) నిబంధనల ప్రకారం చట్టపరంగా చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.