Seva Vikas Co-op Bank | దేశంలోని సహకార బ్యాంకుల్లో మరో బ్యాంక్ కథ కంచికి చేరింది. పుణె కేంద్రంగా పని చేస్తున్న `ది సేవ వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్` లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం ప్రకటించింది. ది వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ వద్ద సరిపడా పెట్టుబడి, ఆదాయ మార్గాలు లేవని పేర్కొంటూ దాని లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సోమవారం నుంచి బ్యాంకింగ్ బిజినెస్ లావాదేవీలు మూసేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ది వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం 99 శాతం డిపాజిటర్లు.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ద్వారా పూర్తి డిపాజిట్లు పొందుతారు. గత నెల 14న డీఐసీజీసీ ఆధ్వర్యంలో ఇన్సూర్డ్ డిపాజిట్ల ఆధారంగా రూ.152.36 కోట్లు చెల్లించింది. డిపాజిటర్లకు కూడా వారి పూర్తి డిపాజిట్లు చెల్లించలేని స్థాయికి వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆర్బీఐ పేర్కొంది.
తక్షణం బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించకుండా ది వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ను నిషేధిస్తున్నట్లు ఆర్బీఐ వివరించింది. డిపాజిట్ల సేకరణ, డిపాజిట్ల చెల్లింపులు చేపట్టొద్దని స్పష్టం చేసింది. బ్యాంకును మూసేయాలని ది వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యానికి మహారాష్ట్ర సహకార శాఖ కమిషనర్, కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేయడంతోపాటు బ్యాంకు లిక్విడేటర్‌ను నియమించారు.