న్యూఢిల్లీ, మే 1: ఇన్నాళ్లూ లండన్, న్యూయార్క్‌ల్లో దాచిన పుత్తడి నిల్వలను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారత్‌కు తిరిగి తీసుకొస్తున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఇక మన బంగారం.. మన దగ్గర్నే ఉంచుకోవడం ఉత్తమం అన్న నిర్ణయానికి ఆర్బీఐ రావడం గమనార్హం.
ఏండ్ల తరబడి విదేశాల్లో పోగేసిన పసిడిని గత కొన్నేండ్ల నుంచి క్రమేణా స్వదేశానికి ఆర్బీఐ తెస్తున్నది. అయితే ఇటీవలికాలంలో ఈ ప్రక్రియను సెంట్రల్ బ్యాంక్ వేగవంతం చేసింది. సడలుతున్న విశ్వాసమే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, రాజకీయ సంక్షోభాలు వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన సొమ్ముకు ఇతరుల వద్ద రక్షణ ఎంత? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి మరి. అందుకే సొంత గూట్లోనే గోల్డ్‌ను పెట్టడం శ్రేయస్కరం అన్న భావన ఆర్బీఐలో బలపడుతున్నదని అంటున్నారంతా. ఇక స్వదేశంలో పసిడి నిల్వలుంటే వాటిని త్వరగా నగదు రూపంలోకి మార్చుకోవచ్చని, ప్రపంచ ఆర్థిక విపత్కర పరిస్థితులను మరింత ప్రభావవంతంగా ఎదుర్కోవచ్చని ఆర్బీఐ భావిస్తున్నది. యుద్ధాలు సైతం ఆర్బీఐ ఆలోచనల్ని బలపరుస్తున్నాయి.
విదేశీ మారకం నిల్వల నిర్వహణపై ఆర్బీఐ ఇచ్చిన అర్ధ వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి భారత్ దగ్గర 880.52 టన్నుల బంగారం ఉన్నది. ఇందులో 77 శాతం (680 టన్నులు) దేశీయంగానే నిల్వ చేశారు. మరో 197.67 (22.5 శాతం) టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ దగ్గర ఉన్నది. ఇంకో 2.85 (0.3 శాతం) టన్నులు డిపాజిట్ల రూపంలో ఉన్నది. నిజానికి 2023 మార్చి నాటికి 63 శాతం భారతీయ పసిడి నిల్వలు విదేశాల్లోనే ఉన్నాయి. దేశంలో 37 శాతమే ఉండేవి. అయితే మూడేండ్లలో ఇది 77 శాతానికి పెరిగింది.
గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్యే 104.23 టన్నుల పుత్తడి నిల్వలను స్వదేశానికి ఆర్బీఐ తెచ్చింది. అంతర్జాతీయంగా చూసినైట్టెతే ఫ్రాన్స్, పోలాండ్ దేశాలూ స్వదేశంలోనే సేఫ్ అంటున్నాయి. న్యూయార్క్ నుంచి పారిస్‌కు 129 టన్నుల బంగారం వచ్చింది. అయితే జర్మనీ, చెక్ రిపబ్లిక్ విదేశీ వాల్ట్స్నే నమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా జర్మనీ దగ్గర 3,352 టన్నుల పుత్తడి నిల్వలుంటే అందులో వెయ్యి టన్నులకుపైగా నిల్వల్ని న్యూయార్క్‌లోనే దాచింది. బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్న టాప్-10 దేశాల్లో భారత్‌ది 8వ స్థానం. 8,133 టన్నులతో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది.