Paytm Payments Bank | ముంబై, జనవరి 31: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝళిపించింది. బుధవారం పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. దీంతో ఈ నెల 29 తర్వాత దాదాపుగా అన్ని పీపీబీఎల్ సేవలు నిలిచిపోనున్నాయి. కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్స్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎంసీ)లు, ఇతర సాధనాల్లో టాప్-అప్లు లేదా డిపాజిట్లను అంగీకరించడానికి వీల్లేదని పీపీబీఎల్‌కు ఆర్బీఐ తేల్చి చెప్పింది. అయితే వడ్డీ, క్యాష్‌బ్యాక్స్ లేదా రిఫండ్స్‌ను కస్టమర్లకు ఎప్పుడైనా చెల్లించుకొనే వెసులుబాటు కల్పించింది. ‘పీపీబీఎల్ కస్టమర్లు తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్స్, ఎన్సీఎంసీల్లో బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉపసంహరించుకోవడం లేదా వాడుకోవడం చేయవచ్చు’ అని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో బ్యాంక్ నుంచి పోయేదే తప్ప.. వచ్చే ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినైట్టెంది.
పీపీబీఎల్ నిబంధనల ఉల్లంఘనలు, పర్యవేక్షణ లోపాలు.. ఆర్బీఐకి తెగ చికాకును తెప్పించాయని, అందుకే ఇంతటి కఠిన ఆంక్షలు వచ్చాయంటున్నారు. ఇప్పటికే కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా బ్యాంక్‌పై నిషేధం ఉన్నది. 2022 మార్చి 11నే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో తాజా నిర్ణయం పీపీబీఎల్‌కు శరాఘాతంలా పరిణమించింది. కాగా, ఎక్స్టర్నల్ ఆడిటర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ రిపోర్టుల్లో బ్యాంక్ నిర్లక్ష్యం బయటపడటంతోనే ఆర్బీఐ కన్నెర్ర చేసినట్టు చెప్తున్నారు. పీపీబీఎల్.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఓ ప్రకటనలో సెంట్రల్ బ్యాంక్ కూడా స్పష్టం చేసింది. ఇక వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్‌లకు చెందిన ‘నోడల్ అకౌంట్స్’నూ రద్దు చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. మార్చి 15 తర్వాత ఈ ఖాతాల్లో ఏ లావాదేవీని అనుమతించబోమన్నది. పీపీబీఎల్‌లో వన్97 కమ్యూనికేషన్స్‌కు 49 శాతం వాటా ఉన్నది. మరోవైపు నిబంధనల్ని పాటించట్లేదని తెలియడంతో ఎన్హెచ్ఏఐ అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) కొత్త ఫాస్టాగ్స్‌ను జారీ చేయకుండా పీపీబీఎల్‌ను నిషేధించింది. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై పీపీబీఎల్ ఏవిధంగానూ స్పందించలేదు.