న్యూఢిల్లీ, జూన్ 10: సెమీకండక్టర్ సంక్షో భం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న దేశీయ ఆటో పరిశ్రమను మరో ఉపద్రవం ముంచెత్తబోతున్నాదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. తమ దేశంలో లభించే అరుదైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా వీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ తాజా పరిణామంతో వాహన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపి భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈవీ విస్తరణ లక్ష్యాలను దెబ్బపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ ఆటోమోటివ్ తయారీదారులు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిలో నిమగ్నమైన వారు అరుదైన భూ అయస్కాంతాల కొరత కారణంగా ఈ ఏడాది జూలై నాటికి తమ ఈవీ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయక తప్పదని పరిశ్రమ వర్గాలు సూచించాయి.
ఏమిటీ అరుదైన భూ అయస్కాంతం?
అధునాతన వాహనాలు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్లకు అరుదైన భూ అయస్కాంతాలు అత్యంత అవసరం. ఎలక్ట్రిక్ మోటర్లు, బ్రేకింగ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, సమర్థవంతంగా పనిచేయడం కోసం బలమైన ఆయస్కాంత శక్తిపై ఆధారపడే ఇతర సిస్టమ్‌లకు ఈ భూ ఆయస్కాంతం తప్పనిసరి. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు 90 శాతానికి పైగా చైనా నుంచే ఇవి సరఫరా అవుతున్నాయి. కొన్ని అరుదైన మిశ్రమ లోహాలు, శాశ్వత ఆయస్కాంతాల ఎగుమతిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా కఠిన నిబంధనలు విధించింది. జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ చర్యలు తీసుకున్నప్పటికీ, అమెరికా విధించిన ప్రతీకార సుంకాలకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.