హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)కు రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ సీహెచ్ కిరణ్ గురువారం రూ.30 కోట్ల విరాళం అందజేశారు. హైదరాబాద్ క్యాంపస్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ మొత్తాన్ని వినియోగిస్తామని ఐఎస్బీ తెలిపింది. ఈ మొత్తంతో 430 సీట్ల సామర్థ్యంతో ఆధునిక ఆడిటోరియం నిర్మిస్తామని పేర్కొన్నది. ఈ సందర్భంగా ఐఎస్బీ బోర్డు చైర్మన్ హరీశ్ మన్వానీ, డీన్ మదన్ పిల్లుట్ల రామోజీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దాతల ఉదారతతో ఐఎస్బీ ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనా సంస్థగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. రామోజీరావుకు విద్యాభివృద్ధిపై ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ కిరణ్ తెలిపారు. ఈ విరాళంతో విద్యార్థులకు ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించనున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు.