హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : చర్లపల్లి పారిశ్రామికవాడలో నకిలీ ఐఎస్ఐ మార్క్‌తో విద్యుత్తు వైర్లు, కేబుళ్లు తయారుచేస్తున్న ఓ పరిశ్రమపై భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) సోమవారం ఆకస్మిక దాడులు చేసి రూ.5 లక్షల విలువైన వైర్లను స్వాధీనం చేసుకున్నది. ఓ పరిశ్రమలో కొన్నేండ్లుగా బీఐఎస్ అనుమతి లేకుండా కేబుళ్లను తయారుచేయడంతోపాటు నకిలీ ఐఎస్ఐ ముద్రలు, లైసెన్స్ నంబర్లతో ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో బీఐఎస్ డైరెక్టర్ పీవీ శ్రీకాంత్ ఆదేశాల మేరకు.. డైరెక్టర్ తన్నీరు రాకేశ్ నేతృత్వంలోని అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది.
ఈ సందర్భంగా విక్రయానికి ఉంచిన నకిలీ ఐఎస్ఐ మార్క్‌తో కూడిన వివిధ బ్రాండ్లకు చెందిన 200కు పైగా పీవీసీ ఇన్సులేటెడ్ విద్యుత్తు వైర్లు, డబ్బాలతోపాటు రూ.5 లక్షల విలువైన కేబుళ్లను జప్తు చేసినట్టు అధికారులు తెలిపారు. గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్తు ఉత్పత్తులన్నీ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ల(క్యూసీవో)పరిధిలోకి వస్తాయి. వీటన్నింటికీ బీఐఎస్ అనుమతి, ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి. అయితే, సంబంధిత పరిశ్రమ నిర్వాహకులు నకిలీ ఐఎస్ఐ మార్క్, లైసెన్స్ నంబర్ వినియోగించి బీఐఎస్ చట్టం-2016లోని సెక్షన్-17ను ఉల్లంఘించినట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ల పరిధిలోకి వచ్చే ఉత్పత్తులను బీఐఎస్ ధ్రువీకరణ లేకుండా తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం నిషేధం. ఇందులో తొలి ఉల్లంఘనకు రెండేండ్ల వరకు జైలు శిక్ష లేదా కనీసం రూ.2 లక్షల జరిమానా, తదుపరి ఉల్లంఘనలకు కనీసం రూ.5 లక్షల జరిమానా లేదా వస్తువుల విలువకు పదిరెట్ల జరిమానా విధించే అవకాశం ఉందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.