Rahul Gandhi- Stock Market | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశీయ స్టాక్ మార్కెట్ల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్ పవన్ ఖేరాతో వీడియో కన్వర్షేషన్ లో మాట్లాడుతూ.. స్టాక్ మార్కెట్లలో సంక్షోభం నెలకొన్నప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టిన సామాన్యులు, వేతన జీవులు, యువతరం ప్రయోజనాలు కాపాడేందుకు తప్పనిసరిగా మార్గాలు రూపొందించాలని అని అన్నారు. స్టాక్ మార్కెట్లు ‘స్పేస్ ఆఫ్ రిస్క్’ అని వ్యాఖ్యానించారు.
ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును రిటైల్ ఇన్వెస్టర్లు.. స్టాక్ మార్కెట్లలో మదుపు చేస్తారని, అటువంటి వారి సొమ్ముకు భద్రత కల్పించేందుకు సృజనాత్మక మార్గాలు ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ నేతలను రాహుల్ గాంధీ కోరారు. పవన్ ఖేరాతో వీడియో కన్వర్షేషన్ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో కింద ‘శుక్రవారం స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6.80 లక్షల కోట్లు హరించుకుపోయింది. అవినీతి సిండికేట్ కు గార్డులు ఎవరు? అని క్యాప్షన్ పెట్టారు.