న్యూఢిల్లీ, జనవరి 30 : దేశీయంగా ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరిగితే తప్ప.. కావాల్సినంత మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను భారత్ ఆకర్షించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ‘దేశీయ కార్పొరేట్లు పెట్టుబడులకు పెద్దగా ముందుకు రావడం లేదు. తొలుత వారు స్వదేశంలో ఇన్వెస్ట్ చేస్తేనే కదా ఆ తర్వాత విదేశీ మదుపరులూ ఇక్కడ పెట్టుబడులపట్ల ఆసక్తి చూపించేది’ అని వ్యాఖ్యానించారు. అయితే కొందరు దీనికి కారణం విధానపరమైన లోపాలే అంటున్నారని రాజన్ చెప్పడం గమనార్హం. కాగా, ఇతర దేశాలతో పోల్చితే భారత్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు చాలా ఎక్కువని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు రాజన్ పైవిధంగా బదులిచ్చారు.
దేశ జీడీపీ బలోపేతానికి ఆర్థిక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే.. కార్పొరేట్లకు ఇబ్బందికరంగా ఉన్న ఆయా సమస్యల్ని పరిష్కరించవచ్చునని రాజన్ అన్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారి దేశీయ కార్పొరేట్లు పెట్టుబడులకు సై అంటే.. విదేశీ ప్రత్య క్ష పెట్టుబడులూ వరదలా వచ్చేస్తాయని అభిప్రాయపడ్డారు. నిజానికి తమిళనాడు వంటి కొన్ని రాష్ర్టాలు ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తున్నాయని రాజన్ గుర్తుచేశారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఆ స్థాయిలో ఎందుకు విదేశీ పెట్టుబడులు రాలేకపోతున్నాయి? అని ఆలోచించాల్సిన, ప్రశ్నించాల్సిన అవసరం ఇప్పుడు ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఇదిలావుంటే ఒకవేళ భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్లే దేశంలోకి ఎఫ్‌డీఐలు తగ్గిపోయాయి అనుకుంటే.. మరిన్ని దేశాలతో వాణిజ్య సంబంధాల బలోపేతంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు తప్పక దృష్టిసారించాల్సిందేనన్నారు. వీలైనన్ని ఎక్కువ దేశాలతో వ్యాపార భాగస్వామ్యాలుంటే ఎప్పటికైనా మంచిదేనన్నారు.