హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న క్వాంటమ్ ఏఐ.. దేశంలో తొలిసారిగా నూతన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఆఫీస్‌ను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు వంటి కొత్త అత్యాధునిక సాంకేతికతల నుంచి వచ్చే మానసిక ఒత్తిడిలను తట్టుకోవడానికి క్వాంటమ్ ఉత్పత్తుల అవసరం ఉంతో ఉందన్నారు. క్వాంట మ్ సేవలు దేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్‌లో లభించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
ఐటీ సంస్థలకు ప్రపంచ స్థాయి సదుపాయాలన్నీ ఇక్కడ లభిస్తున్నాయని, ప్రజలు ఆయా కంపెనీలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్వాంటమ్ సేవలను అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సీఈవో సంజయ్ చిత్తోర్ మాట్లాడుతూ.. తమ ఉత్పత్తులు సాంకేతికతలోనే కాకుండా సమాజంలోనూ ప్రభావం చూపేలా ఉంటాయని, అందుకు ప్రత్యేక ఉదాహరణ తమ ఉత్పత్తి అయిన హీల్మెడ్ ముందంజలో ఉండటమే ఇందుకు కారణమన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలపై తక్షణ అవసరాలను గుర్తించి, చికిత్సకు దోహదం చేసేలా తమ సాప్ట్వేర్ ఉత్పత్తి ఉంటుందన్నారు. ట్రిపుల్ ఐటీ బాసర సహకారంతో విద్యార్థులకు మానసిక ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెచ్చేల పైలెట్ ప్రోగ్రామ్‌ను ఇటీవల ప్రారంభించామని తెలిపారు. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ ఉత్పత్తులు మార్కెట్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, అమెరికా, యూఏఈ దేశాల్లో సమర్థవంతంగా వినియోగిస్తున్నారని, హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన తమ కంపెనీ సేవలు మరిన్ని దేశాల్లో ప్రవేశించడానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, నిర్వాహకులు నరేందర్, సంజయ్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.