Hyderabad | ఒడిశాలోని పూరీ, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.. గత ఏడాది కాలంలో భక్తులు, సందర్శకులు, ఆధ్యాత్మిక వాదులు అత్యధికంగా సందర్శించిన కేంద్రాలుగా పూరీ, వారణాసి, హరిద్వార్ నిలిచాయి. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర సందర్శనకు అత్యధిక బుకింగ్స్ నమోదయ్యాయని ఓయో ‘ట్రావెలోపెడియా-2024’ నివేదిక వెల్లడించింది. హైటెక్ సిటీగా హైదరాబాద్ సందర్శనకు ఏడాది పొడవునా ప్రయాణ బుకింగ్స్ నమోదయ్యాయి.
‘ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఇండియా కొనసాగుతున్నది. భక్తుల సందర్శనలో పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రధాన నగరాలుగా నిలిచాయి. ఆధ్యాత్మిక నగరాల వైపు భక్తులు, యాత్రికులు మళ్లుతున్నారు. డియోఘర్, పలని, గోవర్ధన్ వంటి పర్యాటక కేంద్రాలకు గణనీయ స్థాయిలోనే పర్యాటకులు పెరిగిపోయాయని ఓయో తన నివేదికలో తెలిపింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా నగరాలు ప్రయాణ బుకింగ్స్‌లో టాప్ ప్లేసెస్ సంపాదించుకున్నాయి. ఇక దేశంలోనే అత్యంత పాపులర్.. పర్యాటక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. మహారాష్ట్ర నుంచి యూపీకి అత్యధిక పర్యాటకులు వచ్చారు. తర్వాతీ స్థానాల్లో తెలంగాణ, కర్ణాటక నిలిచాయి.
పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న పట్టణాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వార్షిక ప్రాతిపదికన 48 శాతం ఆయా నగరాలు, పట్టణాలకు పర్యాటకులు పెరుగుతున్నారు. ఖాళీ సమయంలో ప్రజల సందర్శనతో రాజస్థాన్ రాజధాని జైపూర్ టాప్ టూరిస్ట్ మ్యాగ్నెట్‌గా నిలిచింది. ప్రయాణికులకు ఎంతో ఇష్టమైన పర్యాటక కేంద్రాలుగా గోవా, పుదుచ్చెరి, మైసూర్ నిలిచాయి. గతంతో పోలిస్తే ముంబైకి వచ్చే సందర్శకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జూలై చివరి వారంలో బుకింగ్స్ భారీగా పెరిగాయి. క్విక్ గెటవేస్, లాంగ్ స్టేస్‌కు గిరాకీ పెరుగుతోంది.