Pure EV ePluto 7G Max | ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ.. ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ను శుక్రవారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. సింగిల్ చార్జింగ్‌తో 201 కి.మీ దూరం ప్రయాణించే కెపాసిటీ గల ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటర్ ధర రూ.1.14 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని తెలిపింది. హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ తదితర ఫీచర్లతో వస్తున్న ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటర్.. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో లభిస్తుంది.
స్మార్ట్ బీఎంఎస్‌తో కూడిన ఏఐఎస్-156 సర్టిఫైడ్ 3.5 కిలోవాట్ల హెవీ డ్యూటీ బ్యాటరీ ఏర్పాటు చేశారు. బ్లూటూత్ కనెక్టివిటీ, 2.4 కిలోవాట్ల ఇంధనం ఉత్పత్తి చేసే సామర్థ్యం గల పవర్ ట్రైన్, సీఏఎన్ బేస్డ్ చార్జర్ ఉంటాయి. మూడు రకాల మోడ్ల్లో వస్తుంది. ఎటువంటి ఓటీఏ ఫర్మ్ వేర్ అప్డేట్లనైనా అందుకునేలా ఈ స్కూటర్ డిజైన్ చేసినట్లు ప్యూర్ ఈవీ తెలిపింది. ప్రతి రోజూ 100 కి.మీ. దూరం ప్రయాణించే వారిని పరిగణనలోకి తీసుకుని రూపొందించామని ప్యూర్ ఈవీ కో-ఫౌండర్ కం సీఈఓ రోహిత్ వడేరా చెప్పారు. పండుగల సీజన్ నేపథ్యంలో ఈవీ స్కూటర్లకు గిరాకీ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్యాటరీ పరిస్థితిని అనునిత్యం సమీక్షించేలా ఆర్టిఫిషియల్ బేస్డ్ పవర్ డిశ్చార్జ్ వంటి మోడర్న్ ఫీచర్లు ఈ స్కూటర్లో చేర్చామని రోహిత్ వడేరా వివరించారు. తత్ఫలితంగా బ్యాటరీ లైఫ్ 50 శాతం పెరుగుతున్నదన్నారు. ఎత్తైన ప్రదేశం నుంచి దిగుతున్నప్పుడు బండి జారిపోకుండా, ఒకవైపునకు వంగినప్పుడు కింద పడకుండా స్మార్ట్ సెన్సర్లు అడ్డుకుంటాయని తెలిపారు.