న్యూఢిల్లీ, జూన్ 3: వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గబోవని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ కుమార్ గోయల్ అన్నారు. ఈ ఏడాది ఆఖరుదాకా ఇంతేనన్న ఆయన.. డిసెంబర్ ద్రవ్యసమీక్షలో కోతలకు వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుధవారం (జూన్ 5) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ప్రారంభించనున్నది. శుక్రవారం (జూన్ 7) నిర్ణయాలను ప్రకటించనున్నది. ఈ నేపథ్యంలో పీఎన్బీ ఎండీ గోయల్ అంచనా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. కరోనా సమయంలో దిగాలు పడిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్సాహపర్చేందుకు.. ఆర్బీఐ పెద్ద ఎత్తున వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వడ్డీరేట్లను భారీగా పెంచుతూ పోయిన సంగతీ విదితమే. దీంతో రెపో రేటు 6.50 శాతానికి చేరింది. ఫలితంగా అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లూ పెరిగాయి.
ఈఎంఐల భారం..
కరోనా సమయంలో వడ్డీరేట్లు తగ్గడంతో అంతా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ వడ్డీరేట్లు పెరగడంతో ఆయా రుణాల ఈఎంఐ (నెలవారీ వాయిదాలు)లు భారంగా తయారయ్యాయని రుణగ్రహీతలు లబోదిబోమంటున్నారు. ఈసారి తగ్గుతాయంటూ.. ప్రతీసారీ ఎదురుచూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ తమ ద్రవ్యసమీక్షల్ని ముగించేస్తున్నది. గత 8సార్లూ ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే ద్రవ్యసమీక్షపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారంతా. కానీ వస్తున్న అంచనాలు నీరుగార్చేలా ఉంటున్నాయి. ‘వడ్డీరేట్లు అనేవి వృద్ధి, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల్లో ద్రవ్య విధానాల వంటి రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పటికే ఆర్బీఐ.. కీలక వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయికి చేర్చింది. బహుశా ఈ ఏడాది ఆఖర్లో తగ్గింపులకు అవకాశాలున్నాయని చెప్పుకోవచ్చు’ అని గోయల్ అన్నారు.
డిపాజిట్లపై వడ్డీలు పెరగవు
డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇక పెద్దగా పెరగబోవని, 95 శాతం డిపాజిట్ల వడ్డీరేట్లను ఇప్పటికే సవరించడం జరిగిందని గోయల్ తెలిపారు. దీంతో మరో 4-5 నెలలు వడ్డీరేట్లపై స్థబ్ధత ఉంటుందన్న సంకేతాలనిచ్చారు. కాగా, రిటైల్, వ్యవసాయ రంగాలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు రుణాలివ్వడంపై పీఎన్బీ దృష్టిపెట్టినట్టు గోయల్ చెప్పారు. అయినప్పటికీ రుణ చరిత్ర బాగున్న కార్పొరేట్ సంస్థలకూ లోన్లిస్తామన్నారు. మౌలిక రంగ ప్రాజెక్టుల నుంచి, ముఖ్యంగా రహదారుల ప్రాజెక్టుల నుంచి రుణాలకు డిమాండ్ ఉందని చెప్పారు.