న్యూఢిల్లీ, మార్చి 14: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వడ్డీరేట్లను పెంచింది. పెరిగిన వడ్డీరేట్లు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. తాజా నిర్ణయంతో ఎస్బీఐ బేస్ రేటు, బెంచ్మార్క్ ప్రైం లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్) 70 బేసిస్ పాయింట్లు లేదా 0.7 శాతం చొప్పున ఎగబాకాయి. దీంతో వీటి ఆధారంగా బ్యాంక్ ఇచ్చే గృహ, వాహన, విద్య, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీరేట్లు మరింత పెరిగాయి.
బేస్ రేటు
బేస్ రేటును 10.10 శాతానికి ఎస్బీఐ పెంచింది. ఇంతకుముందు 9.40 శాతంగా ఉండేది. బేస్ రేటు అనేది కనీస వడ్డీరేటు. ఇంతకంటే తక్కువ రేటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేవు. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారంగా బేస్ రేటును బ్యాంకులు నిర్ణయిస్తాయి. 3 నెలలకోసారైనా బ్యాంకులు బేస్ రేటును సమీక్షించాలని ఆర్బీఐ చెప్తున్నది.
బీపీఎల్ఆర్
బీపీఎల్ఆర్ను 14.85 శాతానికి ఎస్బీఐ పెంచింది. మునుపు 14.15 శాతంగా ఉన్నది. గృహ రుణాలపై వడ్డీరేటును నిర్ణయించడానికి బ్యాంకులు ఈ బీపీఎల్ఆర్నే పరిశీలిస్తాయి.
మారని ఎంసీఎల్ఆర్
బేస్ రేటు, బీపీఎల్ఆర్ను పెంచినా.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను ఎస్బీఐ యథాతథంగానే ఉంచింది. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆ ర్ కూడా మారలేదు.
1-1.5% పెరగొచ్చు
వచ్చే ఆర్థిక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 100-150 బేసిస్ పాయిం ట్లు (1-1.5 శాతం) పెరగవచ్చని ఇండియా రేటింగ్స్ ఓ తాజా నివేదికలో అంచనా వేసింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.