PPF | పొదుపునకు, దీర్ఘకాలిక మదుపునకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) చక్కని సాధనం. పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ వ్యక్తుల ఆదాయ వృద్ధికి దోహదం చేస్తుంది. పీపీఎఫ్ వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 3 నెలలకోసారి సమీక్ష జరుగుతుంది. ప్రస్తుత వార్షిక వడ్డీరేటు 7.1 శాతం. కనీసం 15 ఏండ్ల లాకిన్ పీరియడ్‌తో ఐదేండ్లు నిరవధికంగా ఖాతాను పొడిగించుకోవచ్చు. ఈ ఖాతా లాభాలను పరిశీలిస్తే..
పీపీఎఫ్‌లో వడ్డీరేట్లు సాధారణంగా 7-8 శాతంగా ఉంటాయి. సేవిం గ్స్ ఖాతా వడ్డీరేటు 3-4 శాతమే. అందుకే పీపీఎఫ్ ఖాతా లు ఆకర్షణీయంగా మారాయి.
ఖాతాలో జమయ్యే మొత్తాలతోపాటు వాటిపై పొందే వడ్డీ ఆదాయానికీ ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులుంటాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరం తమ పీపీఎఫ్‌కు ఖాతాదారులు రూ.500కు తగ్గకుండా, రూ.1.5 లక్షలకు మించకుండా జమ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకమే పీపీఎఫ్. కాబట్టి ఇదో సురక్షిత పెట్టుబడి. కచ్ఛితమైన, స్థిరమైన రాబడులుంటాయి. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులకున్న రిస్క్ ఇక్కడ ఉండదు.
ఖాతాదారులు తమ ఖాతాలో ఉన్న నిల్వల్లో 25 శాతం వరకు రుణంగా తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన ఐదేండ్ల తర్వాత కొద్దికొద్దిగా (బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు) నగదునూ ఉపసంహరించుకోవచ్చు.