IIIT Bangalore Director : చాట్‌జీపీటీ, కో పైలట్ వంటి ఏఐ టూల్స్ రాకతో ఐటీ పరిశ్రమలో ముఖ్యంగా టెకీల్లో గుబులు రేగుతోంది. ఏఐ టెక్నాలజీతో కొలువుల కోత తప్పదని, తమ ఉద్యోగాల పరిస్ధితిపై పలువురు ఉద్యోగులు కలత చెందుతున్నారు. ఎన్విడియా సీఈవో నుంచి పలు టెక్ దిగ్గజాలు ఏఐతో ఉద్యోగాలు రీప్లేస్ అవుతాయనే వ్యాఖ్యలు సైతం టెక్ పరిశ్రమలో ఆందోళన రేకెత్తించాయి. టెకీల ఆందోళనల నడుమ ఐఐఐటీ బెంగళూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవబ్రత దాస్ యువ ఐటీ ప్రొఫెషనల్స్‌కు భరోసా ఇచ్చారు.
ఏఐతో భారత ఐటీ ప్రొఫెషనల్స్ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏఐ గురించి మాట్లాడగానే మెషీన్స్ గురించి ఆలోచించి అది ఉద్యోగాలను కనుమరుగు చేస్తుందని చెబుతారని, కానీ అది ఓ భాగం మాత్రమేనని అన్నారు. ఏఐ ద్వారా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల గురించి ఎవరూ తగినంతగా మాట్లాడటం లేదని చెప్పారు. మనం ఏఐ టూల్స్, ఏఐ యాప్స్, ఏఐ ఆధారిత సేవలు, ఏఐ సపోర్ట్ సిస్టమ్స్‌ను మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఇవన్నీ మనుషులు చేయాల్సిన పనులే అని ఆయన వివరించారు.
దీంతో పెద్దసంఖ్యలో నూతన ఉద్యోగాలు భారీగా ముందుకొస్తాయని ప్రొఫెసర్ దేవబ్రత దాస్ పేర్కొన్నారు. కొన్నేండ్ల కిందట కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేస్తే గంటలకొద్దీ ఫోన్లో గడపాల్సి వచ్చేదని మనం సమస్యలు చెబితే పలు విభాగాలకు కాల్‌ను ట్రాన్స్ఫర్ చేసేవారని గుర్తుచేశారు. అయితే ఇప్పడు కస్టమర్ కేర్ కాల్స్ ఆటోమేట్ అయ్యాయని, ముందుగా రికార్డ్ చేసిన వాయిస్ మనల్ని గైడ్ చేస్తుందని, అయితే ఇతర ఆప్షన్స్ వర్తించకుంటే చివరికి మనిషే కాల్‌ను అడ్రస్ చేస్తారని చెప్పుకొచ్చారు. అలాగే భవిష్యత్ జాబ్ మార్కెట్లో ఏఐ, ఆటోమేషన్ కొన్ని సంప్రదాయ ఉద్యోగాలను తీసివేసినా, కొన్ని పనులను మనుషులే చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.
Read More :
AI | ఏఐ మానవాళిని బానిసలుగా మార్చేస్తుంది : చరిత్రకారుడు యువల్ నోహ్ హరారీ వార్నింగ్