AI : ఏఐ మానవాళిపై పెను ప్రభావం చూపుతుందని, దీంతో మానవాళికి ముప్పు తప్పదని, కొలువుల కోతకు తెగబడవచ్చని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని, జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయని మరికొందరు చెబుతున్నారు. ఏఐ పర్యవసానాలపై చరిత్రకారుడు యువల్ నోహ్ హరారీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐపై నియంత్రణ లేకుంటే లేటెస్ట్ టెక్నాలజీ మనల్ని బానిసలుగా మార్చేస్తుందని, లేకుంటే అది మనల్ని ఏకంగా నిర్మూలిస్తుందని ఆయన హెచ్చరించారు.
సేపియన్స్, 21వ శతాబ్ధం కోసం 21 పాఠాలు అనే బుక్స్ రచయితగా హరారీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో జరిగిన ప్యానెల్ డిస్కషన్లో ఏఐ మానవాళికి విఘాతం కలిగించే తీరును కండ్లకు కట్టారు. ఇక్కడి నుంచి కొన్నేండ్లలోనే ఏఐ మన అదుపు తప్పి మనల్ని బానిసలుగా చేసుకుంటుంది లేదా మనల్ని నిర్మూలిస్తుందని బాంబు పేల్చారు. పదేండ్ల కిందట ఏఐ అంటే కేవలం ఓ సైన్స్ ఫిక్షన్ వ్యవహారంగా ఏ కొద్ది మంది నిపుణుల మధ్య చర్చకు పరిమితమయ్యేదని, కానీ ఇప్పడు అది మన ఆర్ధిక వ్యవస్ధ, సంస్కృతి, రాజకీయాలతో పెనవేసుకుపోయిందని హరారీ వివరించారు.
మరికొన్నేండ్లలో ఏఐ మనల్నే మింగేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ నాగరికతకు ఏఐ పెను విఘాతం కలిగిస్తుందని అన్నారు. మానవాళి ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతోందని, వీటిలో మూడు సమస్యలు మానవాళి మనుగడకు పెను ముప్పు తెస్తాయని చెప్పారు. పర్యావరణ పతనం, ఏఐ వంటి టెక్నాలజీల రాకతో సాంకేతిక అవాంతరాలు, ఇక ప్రపంచ యుద్ధం వాటిల్లే ముప్పును మనం ఎదుర్కొంటున్నానమని, వీటిలో రెండు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. పర్యావరణ విధ్వంసంతో ఏటా వేలాది జాతులు అంతరిస్తున్నాయని అన్నారు. గాజాలో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయల్ సైన్యం హమాస్ మూకలను గుర్తించి టార్గెట్ చేసేందుకు ఏఐ వ్యవస్ధలను మోహరించిందని గుర్తుచేశారు.
Read More :
Health Tips | తెల్ల వెంట్రుకను పీకేస్తే.. మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయా ?