హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంలో సర్కారు విఫలం కావడం, బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చాయి. రూ.లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా బ్యాంక్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి సూచించాయి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో ఫీజు రీయింబర్స్మెంట్ చేయవచ్చని పేర్కొన్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అసొసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్(ఫతి) ప్రతినిధులు సోమవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ ప్రణాళికపై ఫతి చైర్మన్ రమేశ్‌బాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది స్వయం సమృద్ధి ఫీజు ఫండింగ్ స్కీమ్ అని, దీని ద్వారా సర్కారుపై పెద్దగా భారం పడబోదని, రూ.లక్ష కోట్లలో ప్రభుత్వ వాటా పరిమితమని, సీఎస్సార్, కార్పస్‌ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారానే ఎక్కువ నిధులు సేకరించవచని చెప్పారు. లక్ష కోట్ల డిపాజిట్లపై వచ్చే ఏడుశాతం వడ్డీతో ఫీజు రీయింబర్స్ చేయవచ్చని సూచించారు.
ఫతి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం రిజిస్టర్డ్ ట్రస్టును ఏర్పాటు చేయాలి. సీఎం చైర్మన్‌గా, ఆర్థికశాఖ మంత్రి ప్రధాన కార్యదర్శిగా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కోశాధికారిగా, ఇద్దరు మంత్రులు/ఎమ్మెల్యేలు /ఎమ్మెల్సీలు, ప్రతిపక్షపార్టీల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు/ ఎమ్మెల్సీలు, విద్యాశాఖ, బీసీ, ఎస్టీ, ఎస్టీ సంక్షేమశాఖల కార్యదర్శులు, ఇద్దరు వర్సిటీల వీసీలు, ఇద్దరికి మించకుండా ప్రతిష్ఠత వ్యక్తులు, వందకోట్లకు పైగా విరాళమిచ్చిన దాతలు సభ్యులుగా ఉంటారు. ఈ ట్రస్టు ఆర్బీఐ అనుమతితో ప్రత్యేకంగా బ్యాంక్‌ను ఏర్పాటుచేయాలి. ఈ బ్యాంక్ విద్యార్థులు, విద్యారంగం కోసమే పనిచేస్తుంది. హైదరాబాద్‌లో ప్రధాన బ్రాంచి, జిల్లా కేంద్రాల్లో సబ్బ్రాంచీలను ఏర్పాటు చేయాలి. ఈ బ్యాంక్ ద్వారా విద్యారుణాలు, క్రెడిట్‌కార్డులు జారీచేయాలి. బ్యాంక్ నిర్వహణకు ఎస్బీఐ సహకారం తీసుకోవాలి. జాతీయ బ్యాంక్‌ల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారిని సిబ్బందిగా నియమించాలి.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులు, సీఎస్సార్ ఫండ్స్, కార్పస్‌ఫండ్, దాతల విరాళాలు, పూర్వ విద్యార్థుల విరాళాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్సార్ ఫండ్‌ను డిపాజిట్ల రూపంలో సేకరించాలి. ఉదాహరణకు రాష్ట్రంలో 6 వేల హాస్టళ్లున్నాయి. 500 మంది విద్యార్థులున్న ఒక్కో హాస్టల్ నుంచి రూ.10 లక్షలు, అంతకు మించితే రూ.15 లక్షలు ట్రస్టు బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. ఇతర రాష్ర్టాల వర్సిటీ ఆఫ్ క్యాంపస్‌లు, స్టడీ సెంటర్ల నుంచి రూ.15 లక్షలు కార్పస్ ఫండ్‌గా జమచేయాలి. రాష్ట్రంలో అన్ని రకాల స్కూళ్లు కలుపుకంటే 46,702 విద్యాసంస్థలున్నాయి. మరో 2,575 ఉన్నత విద్యాసంస్థలున్నాయి. వీటి నుంచి ఒక ఏడాదికి రూ. 5,557 కోట్లను కార్ఫస్ఫండ్ కింద సమీకరించవచ్చు.
సెస్సుల ద్వారా మరింత సేకరించాలి. మొత్తం అన్ని మార్గాల ద్వారా రూ.లక్షకోట్లు సమీకరించి బ్యాంక్‌లో డిపాజిట్ చేయించాలి. డిపాజిట్‌పై ఏడాదికి రూ.3వేల కోట్ల వరకు వడ్డీ వస్తుంది. ఈ నిధులతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించవచ్చు అని ఫతి సూచించింది. బ్యాంక్‌ను ప్రారంభించిన ఏడాదిలోపు స్వయ సమృద్ధి సాధించవచ్చని, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వమిచ్చే బడ్జెట్‌ను తగ్గించవచ్చని, క్రమంగా ఆర్థిక భారం లేని పథకంగా కొనసాగించవచ్చని పేర్కొన్నది. ఈ ప్రణాళిక అమలుపై ఉన్నతస్థాయి కమిటీ వేసి అధ్యయనం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఫతి వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీధర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఫతి ప్రతినిధులు కేవీ రవికుమార్, రాందాస్, రవీందర్‌రెడ్డి,(గీతాంజలి) ప్రదీప్‌రెడ్డి, కొడాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.