దేశీయ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ రంగ బ్యాంకులూ కీలకం. అయితే ఇటీవలికాలంలో ఆయా బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. డిపాజిటర్లు, మదుపర్లలో నమ్మకాన్ని సడలిస్తున్నాయి. మొండి బకాయిలను మించి బోర్డ్ రూమ్ వార్తో బ్యాంకర్లు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు మరి. ఉన్నతస్థాయి అధికారుల రాజీనామాలు, లెక్కల్లో తేడాలను చూస్తే.. అసలు ఈ బ్యాంకుల్లో ఏం జరుగుతున్నది? అన్న సందేహాలు రాకమానవు.
న్యూఢిల్లీ, మార్చి 26: గత 3 నెలల్లో నిఫ్టీ బ్యాంక్ సూచీ ఓవరాల్‌గా దాదాపు 9.88 శాతం క్షీణించింది. ముఖ్యంగా దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ వాల్యూనే సుమారు 21 శాతం పడిపోవడం గమనార్హం. గడిచిన వారం రోజుల్లోనే ఇంచుమించు 7 శాతం నష్టాలు వాటిల్లాయి. బ్యాంకింగ్ రంగంలో బలహీనపడిన ఇన్వెస్టర్ సెంటిమెంట్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. సాధారణంగా బ్యాంకులకు అతిపెద్ద సమస్య మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ) వంటి బ్యాలెన్స్ షీట్ రిస్కులే. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేట్ బ్యాంకులకు ఈ తలనొప్పి తక్కువే. కానీ అంతకుమించి ఇబ్బందుల్నే ఈ బ్యాంకులు ఎదుర్కొంటున్నాయనిపిస్తున్నది.
ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా.. స్టాక్ మార్కెట్లలో ఆ సంస్థ షేర్ విలువను ఒక్కసారిగా కుప్పకూల్చింది. తన వ్యక్తిగత విలువలు, నైతికతకు విరుద్ధంగా బ్యాంక్ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ తప్పుకోవడం.. బ్యాంక్‌లో పాలనాపరమైన సంక్షోభం అనుమానాలను రేకెత్తించింది. ఆ తర్వాత బ్యాంక్‌లోని మిగతా పెద్దలు వివరణ ఇచ్చినా.. మార్కెట్లో జరుగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దీనిపై స్పందిస్తూ ఆందోళన అక్కర్లేదన్నా.. మదుపర్లలో భయాలు వీడలేదు. ప్రైవేట్ బ్యాంకుల్లో గడబిడలు అలా ఉంటున్నాయి మరి.
ప్రైవేట్ రంగానికి చెందిన బడా బ్యాంకుల్లో చాలావాటిలో గత కొన్నేండ్ల నుంచి ఉన్నతస్థాయి పదవుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు వ్యాపార లేదా మేనేజ్‌మెంట్‌పరంగా వ్యూహాత్మక, నిర్మాణాత్మక కారణాలున్నాయి. అలాగే రిటైర్మెంట్లు, ఇతర సంస్థల్లో మెరుగైన ఉద్యోగావకాశాలని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొన్నిచోట్ల పాలనాపరమైన అంశాలూ ఈ మార్పులకు దారితీశాయి. నిజానికి ఆర్బీఐ గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసిన ఆర్థిక సుస్థిరత నివేదిక-2025లో భారతీయ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి లేదా మొత్తం రుణాల్లో మొండి బకాయిల వాటా నిరుడు సెప్టెంబర్ ఆఖరునాటికి 2.1 శాతంగా ఉన్నట్టు తేలింది.
మార్చి చివర్లో ఇది 2.2 శాతంగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే.. ఎన్పీఏలు ప్రైవేట్ బ్యాంకుల్లో 1.7 శాతంగా, సర్కార్ బ్యాంకుల్లో 2.5 శాతంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుల ప్రతిష్ఠను ఎన్పీఏల కంటే ఇతర అంశాలు ఎక్కువగా మసకబారుస్తున్నాయి. అటాను చక్రవర్తి హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు గుడ్‌బై చెప్పిన దగ్గర్నుంచి మార్కెట్లో ఆ బ్యాంక్ షేర్ల విలువ దాదాపు రూ.87,000 కోట్లు కరిగిపోయాయి.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఈమధ్య ఓ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలోని కార్యకలాపాల్లో నెలకొన్న లోపాలను ఎత్తిచూపింది. ఈ రూ.590 కోట్ల మోసం కేసులో హర్యానా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటిదాకా 11 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఆరుగురు బ్యాంక్ ఉద్యోగులు, ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాతాల నుంచి నిందితులకు సంబంధించిన ఖాతాలకు నకిలీ సంస్థలను సృష్టించి నిధులు మళ్లించారు. ఇటీవల కొటక్ మహీంద్రా బ్యాంక్‌లోనూ ఇదే తరహా కేసు నమోదైంది. బ్యాంక్ శాఖలో పంచ్‌కుల మున్సిపల్ కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి రూ.160 కోట్లు తేడా రావడంతో పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసులో ఓ వ్యక్తిని హర్యానా అవినీతి నిరోధక శాఖ తాజాగా అరెస్టు కూడా చేసింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్‌లో పాలన, ఖాతాల్లో అవకతవకలు దుమారమే లేపాయి. ఉన్నతస్థాయిల్లో రాజీనామాలు, తొలగింపులకు కారణమయ్యాయి.
ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా అక్కడి బ్యాంకింగ్ రంగమే బలం. అలాంటి బ్యాంకుల్లో మోసాలు, పాలనాపరమైన లోపాలు, ఆర్థిక అవకతవకలు.. ఇప్పుడు డిపాజిటర్లు, మదుపర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆ మధ్య ఐసీఐసీఐ బ్యాంక్‌లో చందా కొచ్చర్ వ్యవహారం.. ఆ బ్యాంక్‌ను ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో విదితమే. కార్పొరేట్లతో కుమ్మక్కై అడ్డగోలుగా అప్పులిచ్చి బ్యాంకులు రిస్కులో పడ్డదీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో విశ్వసనీయతను పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా, ప్రైవేట్ రంగ బ్యాంకులైనా.. అమాయక డిపాజిటర్లకు, ఇన్వెస్టర్లకు నమ్మకంగా ఉంటేనే వాటికి మనుగడని గుర్తుచేస్తున్నారు. లేకపోతే యావత్తు దేశమే సంక్షోభంలోకి జారుకుంటుందని హెచ్చరిస్తున్నారు.
యెస్ బ్యాంక్ సంక్షోభం.. యావత్తు దేశీయ బ్యాంకింగ్ రంగంపై ఏ మేరకు ఒత్తిడి కలిగించిందో చెప్పనక్కర్లేదు. బ్యాంక్‌లోని పాలనాపరమైన సమస్యలు.. మదుపరుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా ఆ బ్యాంక్ మార్కెట్ విలువ కుదేలైంది. చివరకు నిఫ్టీ ప్రధాన సూచీలకూ దూరమైంది. 2018 సెప్టెంబర్‌లో ఆర్బీఐ ఆ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను బోర్డు నుంచి వైదొలుగాలని ఆదేశించింది. ఆ తర్వాత రవ్నీత్ గిల్ చేతికి బ్యాంక్ పగ్గాలు వచ్చినా ఫలితం లేకుండాపోయింది. దీంతో 2020 మార్చిలో బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఎస్బీఐతోపాటు ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్రా తదితర బ్యాంకుల సాయంతోగానీ సమస్య గట్టెక్కలేదు. బ్యాంక్‌లో పాలనాపరమైన వ్యవహారాలు ఎంత సున్నితంగా ఉంటాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.