ముంబై, జనవరి 17: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.19,807 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.17,657 కోట్ల లాభంతో పోలిస్తే 12.17 శాతం వృద్ధిని కనబరిచింది. కానీ, సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.19,611 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం తగ్గుముఖం పట్టింది.
ఏకీకృత విషయానికి వస్తే బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 11.46 శాతం వృద్ధితో రూ.18,653.75 కోట్లకు చేరుకున్నది. సమీక్షకాలంలో బ్యాంక్‌కు నికర వడ్డీ ఆదాయం 6.4 శాతం ఎగబాకి రూ.32,600 కోట్లకు చేరుకోగా, వడ్డీయేతర ఆదాయం రూ.13,250 కోట్లుగా నమోదైంది. నూతన కార్మిక చట్టాలను అమలులోకి తీసుకురావడంతో బ్యాంక్ ఒకేసారి రూ.800 కోట్ల నిధులు వెచ్చించడంతో లాభాలపై ప్రభావం చూపిందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.