e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News Gold Price hike | బంగారం ధర భారీగా పెరగనుందా.. మున్ముందు కొన‌గ‌ల‌మా ?

Gold Price hike | బంగారం ధర భారీగా పెరగనుందా.. మున్ముందు కొన‌గ‌ల‌మా ?

Gold Price hike | బంగారం ఆభ‌ర‌ణాలంటే అతివ‌ల‌కు ఎంతో ప్రీతి. పెండ్లిండ్లు.. శుభ‌కార్యాలు.. పండుగ‌ల వేళ ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతుంటారు.. వీలైతే కొత్త ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తుంటారు.. కానీ మున్ముందు బంగారం.. దాంతోపాటు వెండి కొనుగోళ్ల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయా.. వాటి ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయా.. అంటే కేంద్రం నియ‌మించిన జీఎస్టీ ఫిట్‌మెంట్ క‌మిటీ అవుననే అంటోంది. జీఎస్టీ శ్లాబ్‌ల రెగ్యుల‌రైజేష‌న్ పేరుతో బంగారం, వెండి కొనుగోళ్ల‌పై జీఎస్టీ పెంచాల‌ని కేంద్రానికి సిఫార‌సు చేసింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం బంగారంపై 3 శాతం జీఎస్టీ వ‌సూలు చేస్తున్నారు. దీన్ని ఐదు శాతానికి పెంచాల‌ని క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై సార‌ధ్యంలోని జీఎస్టీ ఫిట్‌మెంట్ క‌మిటీ సిఫార‌సు చేసింద‌ని వార్త‌లొచ్చాయి. క‌నీసం ఒక‌టి నుంచి 1.5 శాతం అయినా జీఎస్టీ పెరిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

జీఎస్టీ క‌నిష్ట శ్లాబ్ ఐదుశాత‌మే

అయితే ఇత‌ర వ‌స్తువుల‌పై అతి త‌క్కువ‌గా ఐదు శాతం జీఎస్టీ వ‌సూలు చేస్తున్నారు. శ్లాబ్‌ల హేతుబ‌ద్దీక‌ర‌ణ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తే.. బంగారంపై 3 శాతం నుంచి ఐదు శాతానికి పెంచుతారా.. మిగ‌తా వ‌స్తువుల మాదిరే ఏడు శాతానికి పెరుగుతుందా? అన్న సంగ‌తి తేలాల్సి ఉంది. దీనిపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నిర్ణ‌యం తీసుకుంటే కేంద్రం నోటిఫై చేస్తుంది. శ‌నివారం జీవోఎం స‌మావేశ‌మై తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. జీవోఎం నిర్ణ‌యాన్ని వ‌చ్చే నెల‌లో జ‌రిగే జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించే అవ‌కాశాలు ఉన్నాయి.

నూలు, దుస్తుల‌పై ఇక 12 %

- Advertisement -

ఇప్పటికే నూలు, దుస్తులు, జూట్‌పై 12 శాతం జీఎస్టీ వ‌సూలు చేసేందుకు కేంద్రం నోటిఫికేష‌న్ జారీ చేసింది. 2022 జ‌న‌వ‌రి నుంచి ఈ నోటిఫికేష‌న్ అమ‌లులోకి రానున్న‌ది. జీఎస్టీ ఫిట్‌మెంట్ క‌మిటీ సిఫార‌సుల మేర‌కు బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగితే.. పెండ్లిండ్లు.. ఇత‌ర శుభ‌కార్యాల్లో బంగారం కోసం స‌గ‌టు భార‌తీయుడు షాపింగ్ చేయ‌డం భార‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక జీఎస్టీ శ్లాబ్ రేట్ల స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా ఐదు శాతం జీఎస్టీని ఏడు, 18% శ్లాబ్ 20 శాతం, 12-18 శాతం శ్లాబ్‌ల‌ను క‌లిపి 17 శాతం శ్లాబ్ ఖ‌రారు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌.. జీవోఎంకు ఫిట్‌మెంట్ క‌మిటీ పంపింది.

జీఎస్టీ పెంపు ప్ర‌తిపాద‌న‌పై బులియ‌న్ అసంతృప్తి

బంగారం, వెండిల‌పై జీఎస్టీ రేటు స‌వ‌రించాల‌న్న జీఎస్టీ ఫిట్మెంట్ క‌మిటీ ప్ర‌తిపాద‌న ప‌ట్ల‌ బులియ‌న్ మార్కెట్ వ‌ర్తకులు అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. ఇది బంగారం స్మ‌గ్లింగ్‌, బ్లాక్ మార్కెటింగ్‌కు దారి తీస్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే క‌రోనా నియంత్ర‌ణ‌కు విధించిన లాక్‌డౌన్‌తోపాటు పార‌ద‌ర్శ‌క‌త ప్ల‌స్ ప్యూరిటీ కోసం అమలులోకి తెచ్చిన హాల్‌మార్కింగ్ పాల‌సీ.. బులియ‌న్ వ్యాపారాన్ని దెబ్బ తీసింద‌ని జ్యువెల్ల‌రీ ఆభ‌ర‌ణాల దుకాణాల యాజ‌మాన్యాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

జ్యువెల్ల‌రీ రిక‌వ‌రీకి అడ్డంకి

పెండ్లిండ్ల సీజ‌న్‌తో గ‌త‌ రెండు నెల‌లుగా మ‌ళ్లీ బంగారం అమ్మ‌కాలు పెరిగాయి. ఇప్పుడు జీఎస్టీ పెరిగితే బంగారం అమ్మ‌కాలు త‌గ్గిపోయే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ద‌ని వ్యాపారులు వాపోతున్నారు. జీఎస్టీ పెంచితే సుదీర్ఘ‌కాలంగా ఇబ్బందులెదుర్కొంటున్న బులియ‌న్ మార్కెట్ రిక‌వ‌రీకి అడ్డంకిగా మారుతుంద‌ని ఇండియ‌న్ బులియ‌న్ జ్యువెల్ల‌ర్స్ అసోసియేష‌న్ తాన్యా ర‌స్తోగి చెప్పారు. ఇప్ప‌టికే బంగారం కొనుగోలు ఖ‌ర్చుతో కూడుకున్న‌ద‌ని, జీఎస్టీ పెంచితే మ‌రింత వ్య‌య‌భ‌రితం అవుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

అసంఘ‌టిత వ్యాపారానికి ప్రోత్సాహం

జీఎస్టీ పెంపు ప్ర‌తిపాద‌న అసంఘ‌టిత బంగారం వ్యాపారాన్ని ప్రోత్స‌హిస్తుంద‌ని, సంఘ‌టిత రిటైల్ వ్యాపారుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని పూజా డైమండ్స్ డైరెక్ట‌ర్ శ్రేయ్ మెహ‌తా పేర్కొన్నారు. ప్ర‌పంచ బంగారం మండ‌లి (డ‌బ్ల్యూజీసీ) నివేదిక ప్ర‌కారం త‌క్కువ ధ‌ర‌లు పెంట్ ఆఫ్ కొనుగోళ్ల‌తో సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో బంగారం దిగుమ‌తులు 58 శాతం పెరిగి 61 నుంచి 96 ట‌న్నుల‌కు చేరుకుంది.

మూడు త్రైమాసికాల్లో పెరిగిన డిమాండ్‌

గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది గ‌త మూడు త్రైమాసికాల్లో డిమాండ్ పెరిగింది. 2020లో 360 ట‌న్నులు దిగుమ‌తి చేసుకుంటే ఈ ఏడాది 691 ట‌న్నుల బంగారం దిగుమ‌తైంది. ఈ నేప‌థ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా బంగారం దిగుమ‌తికి జ్యువెల్ల‌రీ వ్యాపారులు సిద్ధం అవుతున్నారు. గ‌త నెల‌లో తులం బంగారం ధ‌ర రూ.46,200-46,600 మ‌ధ్య త‌చ్చాడితే.. సోమ‌వారం రూ.48,834 పలికింది. చ‌ట్ట విరుద్ధ వ్యాపారానికి ప్రోత్సాహం పెరుగుతుంద‌ని ఐశ్ప్ర జెమ్స్ అండ్ జువెల్ల్స్ డైరెక్ట‌ర్ వైభ‌వ్ ష‌రాఫ్ తెలిపారు. బంగారం ధ‌ర‌లు అంత‌ర్జాతీయ మార్కెట్‌తో అనుసంధాన‌మై ఉంటాయ‌ని డ‌బ్ల్యూహెచ్పీ జ్యువెల్ల‌ర్స్ డైరెక్ట‌ర్ ఆదిత్య పెథే చెప్పారు. బంగారం కేవ‌లం ఆభ‌ర‌ణాలు మాత్ర‌మే కాద‌ని, పెట్టుబ‌డి మార్గం అని గుర్తు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement