న్యూఢిల్లీ, నవంబర్ 15: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మరోసారి కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం అధికమవడం, ద్రవ్యోల్బణం ఒత్తిడి, నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే కార్ల ధరలను పెంచాల్సి వస్తున్నదని పేర్కొం ది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో జీఎల్సీ మాడల్ రూ.2 లక్షల వరకు అధికమవనుండగా, టాప్-ఎండ్ మాడల్ మేబ్యాక్ ఎస్680 లగ్జరీ కారు రూ.9 లక్షల వరకు పెరగనున్నది. గడిచిన మూడు త్రైమాసికాలుగా ముడి సరుకుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, ముఖ్యంగా కమోడిటీ ఉత్పత్తుల ధరలు 10 శాతానికి పైగా అధికమయ్యాయని, దీంతోపాటు లాజిస్టిక్ ఖర్చులు కూడా పెరిగాయని మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ తెలిపారు. డిసెంబర్ 31 లోపు బుకింగ్చేసుకున్న వాహనాలకు ఈ ధరల పెంపు నుంచి మినహాయింపు లభించనున్నదన్నారు. ప్రస్తుతం సంస్థ రూ.45 లక్షల నుంచి రూ.3.6 కోట్ల లోపు పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.