హైదరాబాద్, ఆగస్టు 22: రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ..హైదరాబాద్‌లో రూ.642 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన 1.2 గిగావాట్ల సోలార్ సెల్ లైన్లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ సోలార్ సెల్ లైన్లో ఎన్ టైప్ జీ12ఆర్(టెక్నాలజీ) ఉపయోగించి అధిక సామర్థ్యం కలిగిన పెద్ద ఫార్మాట్ 620 డబ్ల్యూ డీసీఆర్ టాప్కాన్ సోలార్ మాడ్యుల్స్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది.
గతంలో వినియోగించిన మోనో పెర్క్ కంటే టాప్కాన్ మాడ్యుల్స్ అత్యంత బలమైనవని కంపెనీ వర్గాలు వెల్లడించారు. అధిక సామర్థ్యం కలిగిన మాడ్యుల్స్‌ను తయారు చేసే సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, దీంతో వీటికి డిమాండ్ కూడా అధికంగా ఉంటుందని ప్రీమియర్ ఎనర్జీస్ ఎండీ, సీఈవో చిరంజీవ్ సాలుజా తెలిపారు.
భవిష్యత్తు అంతా ఇదే టెక్నాలజీ వినియోగించనున్నట్టు, 620 డబ్ల్యూ డీసీఆర్ మాడ్యుల్ మార్కెట్లోకి రానున్నాయన్నారు. దేశీయ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ప్రీమియర్ ఎనర్జీ ప్రస్తుతం 7.1 గిగావాట్ల తయారీ సామర్థ్యం కలిగివున్నది. వీటిలో 2 గిగావాట్ల సోలార్ సెల్స్, 5.1 గిగావాట్ల సోలార్ మాడ్యుల్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 12.4 గిగావాట్లకు పెంచుకోనున్నట్లు ప్రకటించింది.