హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సోలార్ పరికరాల తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ తెలంగాణలో 5.6 గిగావాట్ల సోలార్ మాడ్యుల్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సీతారాంపురం వద్ద సంస్థ ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం ప్రారంభించారు. దీంతో ప్రీమియం ఎనర్జీస్ మొత్తం మాడ్యుల్ తయారీ సామర్థ్యం 11.1 గిగావాట్లకు చేరుకున్నది. దీంతోపాటు 6 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బీఈఎస్ఎస్) యూనిట్‌తోపాటు 18 వేల మెట్రిక్ టన్నుల సామ ర్థ్యం కలిగిన అల్యూమినియం ప్లాంట్ నిర్మాణ పనులను కూడా సంస్థ ప్రారంభించింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ప్రీమియర్ ఎనర్జీస్’లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు రాష్ర్టాన్ని ఎంచుకోవడం, రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణను ప్రపంచ స్థాయి క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, సుస్థిరాభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు.