హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ జెప్టోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్‌లో 5 ప్రగతి సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఎంవోయూ చేసుకున్నది. ఈ సెంటర్ల ద్వారా పనివేళల్లో ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్, ఇతర డెలివరీ నెట్‌వర్క్‌ల్లో పనిచేసే గిగ్ కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. కాగా, ప్రతి ప్రగతి సెంటర్లో విశ్రాంతి స్థలం, తాగునీరు, టాయిలెట్స్, ప్రాథమిక చికిత్సా సదుపాయం, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, వైఫై కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఆయా సెంటర్లలో క్రమం తప్పకుండా హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు.
గిగ్వర్కర్లతోపాటు గుర్తింపులేని వర్కర్లకు ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఈ కేంద్రాల్లో అవగాహన కల్పించనున్నారు. జెప్టో ఈ సెంటర్లకు నిధులు సమకూర్చడంతోపాటు నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వం, జెప్టో సంస్థ కలిసి ఈ సెంటర్లకు స్థలాలను గుర్తించనుండగా.. లొకేషన్లనుబట్టి వందల మంది కార్మికులు సేద తీరేలా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ.. అర్బన్ ఎకానమీకి కీలకమైన గిగ్ వర్కర్లకు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జెప్టో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ శర్మ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల కోసం ప్రగతి ప్రాజెక్టులో భాగంగా ఈ సెంటర్లను విస్తరిస్తున్నామన్నారు.